హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): రాచి రంపాన పెడుతున్న కాంగ్రెస్ రాజ్యంలో ఎవుసం పరిహాసమై రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రోడ్డుపైనే పడి ఉన్నా.. కొనే దిక్కు లేక ఆవేదనతో కుమిలిపోతున్నాడు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసి రోజులతరబడి రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కనిపించిన అధికారి కాళ్లు పట్టుకొని బేలగా వేడుకుంటున్నాడు. సహనం నశించి కడుపుమండిన రైతులు బుధవారం పలుచోట్ల రోడ్డెక్కి ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
ధర్నాలు, రాస్తారోకోలతో సర్కార్‌పై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ధాన్యం కొనుగోళ్లలో ఆన్లైన్ ట్రక్‌షీట్ విధానం తెచ్చి రైతులను మరిన్ని ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ నెల 28న ‘నమస్తే తెలంగాణ’లో ‘రైతన్న నెత్తిన ‘ట్రక్‌షీట్’ శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనంతో స్పందించి ఆన్లైన్ ట్రక్‌షీట్ విధానాన్ని నిలిపివేసింది. పాత పద్ధతిలోనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించింది.
వడ్లకొండలో రైతుల రాస్తారోకో

ధాన్యం కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ జిల్లా వడ్లకొండలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతులు మాట్లాడుతూ ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో రెండు వారాల క్రితం ధాన్యం పోసినా నేటికీ కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందారు. ధాన్యాన్ని కొంత మేరకు తీసుకున్నా బస్తాలు మాత్రం మిల్లులకు తరలించడం లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు జనగామ ఆర్డీవో గోపీరామ్ హామీతో ధర్నా విరమించారు.
వడ్లు కొనేందుకు రోజుకో నిబంధనా?

ధాన్యం కొనుగోలుకు రోజుకో విధానం తెస్తూ కాంగ్రెస్ సర్కార్ ఆగం జేస్తున్నదని రైతులు మండిపడ్డారు. సర్కార్ తీరును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట బస్‌స్టాండ్ కూడలిలో రైతులు బుధవారం మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. గోపాల్రావుపేట వ్యవసాయ మార్కెట్లో నెలరోజుల క్రితం ధాన్యం తెచ్చి కుప్పలుపోశామని, ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని విమర్శించారు.
రైతు సమస్యలు పట్టని ‘కడియం’

అధికార దాహంతో కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని రాజవరంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్లెక్సీకి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కేశిరెడ్డి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పది రోజులై ధాన్యం కాంటా పెట్టడం లేదని ఆగ్రహించారు.
కొనుగోళ్ల నిలిపివేతపై భగ్గుమన్న రైతన్న

మక్క కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ట్రాక్టర్లతో రోడ్డును దిగ్బంధించిన ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్ యార్డు వద్ద బుధవారం చోటుచేసుకున్నది. రెండు రోజులక్రితం రైతులు మక్కజొన్నలు తీసుకుని తొగుట మార్కెట్‌కు వచ్చారు. గేట్‌కు తాళం వేసి ఉండటంతో ట్రాక్టర్లు అక్కడే ఉండటంతో కిరాయిలు మీదపడ్డాయంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. స్పందించిన సిబ్బంది గేటు తాళం తీయడంతో ట్రాక్టర్లలో ఉన్న మక్కజొన్నలు ఖాళీ చేశారు.
ధాన్యం కొనుగోలులో సర్కార్ ఫెయిల్: ఎర్రబెల్లి

ధాన్యం, మక్కల కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతుబంధు సాయం రెండు ఎకరాలకు వరకే ఇచ్చి చేతులు దులుపుకొన్నదని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదని, గిట్టుబాటు ధర కల్పించడంలో సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు.
మక్క రైతుల విలవిల

జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కుందారంలో మక్కల కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. దాదాపు 4 వేల బస్తాలను గోదాములకు తరలించేందుకు వాహనాలను సమకూర్చకపోవడంతో లోడ్ నిలిచిపోయింది.
రైస్ మిల్లుల వద్ద బారులు తీరిన ట్రాక్టర్లు, లారీలు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలోని రైస్ మిల్లుల వద్ద వడ్లలోడ్తో వస్తున్న ట్రాక్టర్లు, లారీలు బారులుతీరుతున్నాయి. మిల్లుల్లో సరిపడా స్థలం లేక గంటల తరబడి రోడ్లపైనే వడ్లలోడుతో డ్రైవర్లు వేచి ఉండాల్సివస్తున్నది. ప్రతి మిల్లు ఎదుట సుమారు 100 నుంచి 150 వాహనాలు నిరీక్షిస్తున్నాయి. ఇవి అన్లోడ్ అయి ట్రక్‌షీట్ పూర్తయితేనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమవుతాయి. వడ్లు పండించడం ఒక ఎత్తయితే వాటిని అమ్ముకోవడం మరో ఎత్తుగా మారుతున్నది. కాంటాలయ్యాక పనైపోతుందనుకున్న రైతుకు ట్రక్‌షీట్ పేరిట మరిన్ని రోజులు ఎదురు చూడాల్సి వస్తుంది. దీంతో కొత్త పద్ధతికి స్వస్తి చెప్పి పాత విధానంలోనే కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచీ రైతులను అడుగడుగునా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాడు యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు నేడు ధాన్యం కొనుగోలు కోసం రోడ్డెక్కుతున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేస్తున్న రైతులు

మక్కలు కాంటా వేయడం లేదని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎస్సై కాళ్లపై పడి ఓ మహిళా రైతు ‘కాల్మొక్తం సారూ..
జర మక్కలు కొనుండ్రి’ అంటూ దీనంగా వేడుకున్నది.