హైదరాబాద్, జూన్ 2(నమస్తే తెలంగాణ): రైతులు ఒకే పంట వేయొద్దని, అన్ని పంటలూ పండించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. పరోక్షంగా వరి ఎక్కువ పండించవద్దనే సంకేతాలిచ్చారు. గతంలో పంటల మార్పిడిపై నాటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలనే పలు వేదికలపై పలుకుతున్నారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభలోనూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ ఒకే పంట వెయ్యొద్దని, అన్ని రకాల పంటలు వేస్తూ లా భాలు చవిచూడాలని సూచించారు. ఇదే వేదికగా ముఖ్యమంత్రి తన అచేతన స్థితిని మరోసారి బయటపెట్టుకున్నారు. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకోలేని తన నిస్సహాయస్థితిని ప్రజలకు తానే స్వయంగా వివరించుకున్నారు.
రాష్ట్ర ఆవిర్భావ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటి రంగంపై మాట్లాడుతూ తెలంగాణకు వర ప్రదాయిని అయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయ త్నం చేస్తున్నామని చెప్పారు. తమ్మిడిహట్టి బ రాజ్ నిర్మించే అంశంపై ఏడాది నుంచీ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నట్టు చె ప్పారు. తాను లేఖ రాశాను అంటూ, అందు కు ఆయన స్పందించడం లేదని చెప్తూ.. మరోవైపు తమకు ఎలాంటి అపాయింట్మెం ట్ ఇ వ్వడం లేదంటూనే ఏడాదిగా చర్చలు జ రుపుతున్నట్టు అబద్ధాలు వల్లెవేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు, 2014-15లో ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కేసీఆర్ హ యాంలో ఇచ్చిన ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకున్న ముఖ్యమంత్రి.. రికార్డు సమయంలో 67,763 పోస్టులు భర్తీ చేసి, దేశానికే ఆదర్శంగా నిలిచినట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వదిలేసిన మిగతా సగం స్పీచ్‌లో అన్నీ ప్రభుత్వ వ్యతిరేక అంశాలే ఉండటం గమనార్హం. పోరాట యోధుల గుర్తింపు తర్వాత ‘కులగణన’ ఉన్నది. ఆ ప్రక్రియ రాష్ట్రంలో సరిగ్గా నిర్వహించలేదని ఇప్పటికే సబ్బండ వర్గాలవారు ఆందోళనలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ ఉన్నది. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామో తెలియక అధికారులు దానిని పూర్తిగా పట్టించుకోకపోవడంతో అది కూడా ఫెయిల్ అయింది. దాని తర్వాత ‘ఉద్యోగుల రూ.కోటి బీమా పథకం’ ఉన్నది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం నిధులు కట్ చే స్తుండగా.. అందుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు, జీవోలు ఇవ్వలేదు. దీంతో అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఆ తర్వాత ‘ఆరోగ్య సంరక్షణ’ అంశం ఉన్నది. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ అధ్వానంగా మారడంతో దానిపైనా ప్రజల్లో నైరాశ్యం నెలకొన్నది. తర్వా త ‘మాదక ద్రవ్యాలకు కళ్లెం’ అంశం ఉన్నది. రాష్ట్రంలో ఎక్కడచూసినా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండటం.. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా కొంతమంది యువత మత్తులోనే జోగుతుండటంతో వ్యవస్థలు స రిగ్గా పనిచేయడం లేదనే అపవాదు ఉన్నది. ఆ తర్వాత సంస్కృతికి పెద్దపీట, క్యూర్-ప్యూర్-రేర్ మోడల్, హైడ్రా, మూసీ పునరుజ్జీవనం, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వంటివి ఉన్నాయి.
మన సంస్కృతిని కాపాడటానికి సీఎంగా తాను చేసినవి గొప్పగా ఏమీ లేకపోవడం, క్యూర్, ప్యూర్, రేర్ అనేవి ప్రజలకు ఎందుకూ పనికిరాకుండా పోవడం, హైడ్రాపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు, మూసీ బాధితులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుండటం వంటివి అన్నీ వ్యతిరేకాంశాలే ఉంటడంతో వాటిని తెలివిగా ఎండ సాకు చూపి సీఎం తప్పించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇండ్ల స్థలాల విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తారని వేలాదిగా ఉన్న జర్నలిస్టులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటించనున్నదని, అది కూడా జూన్ 2నే ప్రకటిస్తారని ఓ మంత్రి తమ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఆ ఊసెత్తలేదు. ముఖ్యమంత్రి సగం వదిలేసిన స్పీచ్‌లోనూ ఆ ప్రస్తావన లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.
జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటిస్తారని సమ్మె విరమణ నుంచి ఎదురుచూసిన ఆర్టీసీ కార్మికులకు నిరాశే మిగిలింది. త్వరలో ప్రకటిస్తామని నాడు మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ వేసి కార్మికులను మభ్యపెట్టారు. ఆ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుండటంతో కార్మికులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయి నిరసన గళం వినిపించారు. జూన్ 2న సీఎం ప్రసంగంలో అపాయింటెడ్ డే ప్రస్తావన లేకపోవడంతో తమ ఆశలతో ప్రభుత్వం ఆటలాడుకుంటున్నదని మండిపడుతున్నారు.
ఎండ ఎక్కువున్నదని స్పీచ్ ఆపేసిన సీఎం.. మిగతా విషయాలు బుక్‌లెట్‌లో ఉంటయి
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆవిర్భావ సభలో ప్రభుత్వం పేదలకు ఏవైనా సంక్షేమ పథకాలు ప్రకటిస్తుందేమోనని ఆశించిన వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించేసి వెళ్లిపోయారు. మొత్తం 16 పేజీల స్పీచ్‌లో కేవలం 9 పేజీల స్పీచ్‌ను మాత్రమే చదివి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రసంగం పూర్తి కాకుండానే ఆపివేశారు. ‘మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాల్సింది ఉన్నది. కానీ, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నది. కాబట్టి.. మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్‌లెట్‌లో ఉంటయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సంక్షిప్తంగా పూర్తి చేస్తాం.
రాతపూర్వక వివరాలన్నీ రాష్ట్ర ప్రజలకు అందించాం. మీడియా దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అంటూ స్పీచ్‌ను మధ్యలోనే ఆపేశారు. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా.. సభకు పిలిపించిన మహిళలు, పురుషులకు మంచినీళ్లు, మజ్జిగా సరఫరా చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో దాహానికి తట్టుకోలేక చంటి పాపలతో వచ్చిన మహిళలు నీరు, మజ్జిగ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసి ప్యాకెట్లు పంచాల్సి వచ్చింది. అవికూడా కొందరికి అందకపోవడంతో నిట్టూర్చుతూ సభ నుంచి వెళ్లిపోయారు.
లోకేశ్‌కు ఎస్.. రేవంత్‌కు నో.. ఏపీ మంత్రికి ఉన్న విలువ.. తెలంగాణ సీఎంకు లేదా?
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మించే అంశంపై మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాసినా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. తాజాగా అదే అంశాన్ని మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ ప్రస్తావించి తన నిస్సహాయతను బయటపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మరో రాష్ట్ర సీఎంకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటీ..? అనే చర్చసాగింది. అయితే ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మాత్రం సోమవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబైలో కలిశారు.
పెట్టుబడులకు ఏపీలో ప్రోత్సాహం, విద్యారంగంలో సంస్కరణలపై విస్తృతంగా చర్చించారు. దీంతో పక్క రాష్ట్ర మంత్రికి సమయం కేటాయించిన మహారాష్ట్ర సీఎం.. తెలంగాణ సీఎంకు టైమ్ ఇవ్వకపోవడం ఏందీ? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. నారా లోకేశ్‌కు ఉన్న విలువ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేదా..? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అన్నింటినీ ఇతరులపై నెట్టి తప్పించుకునేందుకే ఈ డ్రామాలని సీఎం తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.