పర్వతగిరి, జూలై 21 : వారం రోజుల్లో సాగునీరు ఇవ్వకపోతే రైతులతో పాదయాత్రగా వెళ్లి సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, రైతు వ్యవతిరేక విధానాలతో అందరూ అవస్థలపాలవుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
రైతుల సాగునీటి ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీటి సమస్యే లేకుండా చేయాలని పాదయాత్ర చేస్తే దానిపై కొంతమంది చిల్లర మాటలు మాట్లాడారని విమర్శించారు. గతంలో గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ సహా 11 ప్రాజెక్టులు కడుతుంటే వాటికి వ్యతిరేకంగా పోరాటం చేశానని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే రైతు భరోసా వేశారని విమర్శించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.