Green field Road | యాచారం, జనవరి 9: రంగారెడ్డి జిల్లా యాచారం సమీపంలో ప్రభు త్వం తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుపై రైతుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భూములిచ్చే ప్రసక్తే లేదని సర్వేను అన్నదాత లు అడుగడుగునా అడ్డుకుంటున్నా రు. ఇప్పటికే కడ్తాల్, అమన్‌గల్‌లో రైతులు తిరగబడ్డారు. తాజా గా యాచారం మండలంలోని కుర్మిద్ద గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వేపై తిరగబడ్డారు. సర్వే మార్కింగ్‌కు వెళ్లిన అధికారులను నిలదీశారు. గ్రామపంచాయతికి అనుబంధంగా ఉన్న మంగలిగడ్డతండాలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు, యాచారం తహసీల్దార్ అయ్యప్ప, రెవెన్యూ సిబ్బంది గురువారం సర్వే కోసం అక్కడికి వెళ్లారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ సీఐ కృష్ట్రంరాజు, యాచారం సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంగలిగడ్డతండాలో 82, 94 సర్వే నంబర్లలోని భూమిలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే మార్కింగ్‌కు రెవెన్యూ అధికారులు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. కోర్టు స్టే ఉన్న భూములను ఎలా సేకరిస్తారని, కనీసం సమాచారం లేకుండా భూముల్లోకి వచ్చి, సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. కోర్టులో తేలేవరకు తమ భూముల వద్దకు రావొద్దని మాజీ సర్పంచ్ బందె రాజశేఖర్‌రెడ్డి, స్థానిక నాయకులు కిషన్‌నాయక్, శ్రీకాంత్, రైతులు స్పష్టంచేశారు. ఫార్మాసిటీ కోసం తీసుకున్న అసైన్డ్ భూముల్లోనే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని, పచ్చని పంట పొలాల్లో రోడ్డు వేయడమేంటని ఆర్డీవో అనంతరెడ్డిని రైతులు నిలదీశారు. తమ భూముల వివరాలు ఆన్లైన్లో టీఎస్ఐఐసీ పేరు మీద చూపిస్తున్నాయని వాపోయారు. ప్రభుత్వ చర్య వల్ల రైతుబంధు, రైతుబీమా పథకాలకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మా ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వేకు సహకరించాలని ఆర్డీవో అనంతరెడ్డి రైతులకు సూచించారు. ఇప్పటికే రూపొందించిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు రూట్ మ్యాప్‌ను మార్చేందుకు వీల్లేలేదని పేర్కొన్నారు. భూసర్వేకు సహకరించాలని కోరారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ రో డ్డు సర్వే మార్కింగ్‌ను అడ్డుకున్న రైతులు అక్క డి నుంచి వెళ్లిపోవడంతో అధికారులు మళ్లీ సర్వేను తిరిగి కొనసాగించినట్టు తెలుస్తున్నది.