కేసముద్రం, ఫిబ్రవరి 3: పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకొని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వాటర్‌ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు. 60 ఏండ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూములకు కొత్త రెవెన్యూ గ్రామంగా ఏర్పడిన నాటి నుంచి ఈ సమస్య ఏర్పడిందని వారు పేర్కొన్నారు. పలుమార్లు అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించినప్పటికి కొంత మందికే పట్టాలు ఇస్తూ చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకపోవడంతో పథకాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నారాయణపురం రైతుల గురించి మాట్లాడి పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా అతీగతీ లేదని మండిపడ్డారు. ఇంకా 1124 ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సి ఉన్నదని వారు పేర్కొన్నారు. తహసీల్దార్ హామీతో రెండు గంటల తరువాత ట్యాంకు దిగి వచ్చారు.