హన్వాడలో అసహనం
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పీఏసీసీఎస్కు ఆదివారం రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ఉదయం నుంచి క్యూ కట్టారు. పక్కనే కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడారు. పీఏసీసీఎస్కు 600 బస్తాల యూరియా వచ్చిందని ఎవరూ ఇబ్బందులు పడకుండా తీసుకెళ్లాలని సూచించారు. సాయంత్రం వరకు వేచి ఉన్నా తగినంత యూరియా లభించక రైతులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
వెంకటాపూర్, ఆగస్టు 24 : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్, పాలంపేట పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. మండలానికి 2,750 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, 1840 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండడంతో రైతులకు అవసరమైన మేర సరఫరా చేయలేకపోతున్నామని మండల వ్యవసాయ అధికారి శైలజ తెలిపారు.
ఒక్కరికి ఒక్క బస్తానే..
నర్సంపేట, ఆగస్టు24 : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి పీఏసీఎస్ గోదాంకు యూరియా కోసం ఆదివారం తెల్లవారుజామునే రైతులు బారులు తీరారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారులు, సిబ్బంది లైన్లో ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో బస్తా మాత్రమే పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతుండగా ఒక్కో బస్తా మాత్రమే ఇవ్వడమేంటని రైతులు మండిపడుతున్నారు.
వర్ధన్నపేటలో వెతలు
వర్ధన్నపేట, ఆగస్టు 24 : వర్ధన్నపేటలోని రైతు వేదిక వద్దకు రైతులు ఉదయం 5 గంటలకే చేరుకోగా పీఏసీఎస్ సిబ్బంది కూపన్లు పంనిణీ చేసి ఒక్కో రైతుకు ఒక్కో బస్త్తా యూరియా అందజేశారు. ఇంటి, వ్యవసాయ పనులను వదులుకొని కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిద్రాహారాలు మాని ..
చిగురుమామిడి, ఆగస్టు 24: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి సొసైటీ వద్ద రైతులు శనివారం అర్ధరాత్రి 12.30 గంటలవరకు నిద్రాహారాలు మాని పడిగాపులుకాశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచే 800 మందికి పైగా రైతులు బారులుతీరారు. ఉదయం 6 నుంచి 7.30 గంటల మధ్య ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. 600 మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
లైన్లో పట్టాదారు పాస్ పుస్తకాలు
పర్వతగిరి, ఆగస్టు 24 వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదిక వద్ద ఆదివారం ఉదయమే రైతులు పట్టాదారు పుస్తకాల లైన్ పెట్టారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని, తక్షణమే సరిపడా యూరియా బస్తాలు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఉదయం నుంచి లైన్లో ఉన్నా దొరకని యూరియా
నెక్కొండ, ఆగస్టు 24 : వరంగల్ జిల్లా నెక్కొండ నెక్కొండ సొసైటీలో 444 బస్తాలు ఉండగా, వేయి మంది రైతులు ఉదయం 6 గంటలనుంచే క్యూ కట్టారు.మూడు గంటలపాటు క్యూలో వేచిఉన్నా యూరియా దొరకలేదని కొందరు రైతుల ఆగ్రహం వ్యక్తం చేయగా మంగళవారం మరో 444 బస్తాలను పంపిణీ చేస్తామనిరైతులను సముదాయించి టోకెన్లు ఇచ్చి పంపించారు.
సద్దులు.. దుప్పట్లు తెచ్చుకుని..
కొత్తగూడ, ఆగస్టు 24: మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి సొసైటీ వద్ద శనివారం రాత్రి మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు సద్దులు కట్టుకొని.. దుప్పట్లు తెచ్చుకొని పడిగాపులు కాశారు. ముందస్తుగా ఆధార్‌కార్డు, చెప్పులు క్యూలో పెట్టి అక్కడే నిద్రించారు. యూరియా కొరత లేదని అంటున్న అధికారులను మరి ఇదేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం గంటల తరబడి పడిగాపులుకాస్తే ఒక్కొక్కరికి ఒకే బస్తా చొప్పున ఇవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.
యూరియా కోసం జాగారం
యూరియా కోసం రైతులు అల్లాడుతున్నారు. వేసిన పంటలను కాపాడుకొనేందుకు తిండితిప్పలు మాని ఉదయం నుంచి రాత్రి దాకా కేంద్రాల వద్ద బారులు తీరినా ఎరువులు అందక తండ్లాడుతున్నారు. సద్దులు, దుప్పట్లు తెచ్చుకొని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీ వద్ద శనివారం రాత్రి ఏకంగా జాగారమే చేశారు. ముందస్తుగా ఆధార్‌కార్డు, చెప్పులు పెట్టి అక్కడే నిద్రించారు. ఆదివారం సైతం గంటల తరబడి క్యూ కట్టినా ఒకే బస్తా ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు.