రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్‌రావు’. కృష్ణ పోలూరు దర్శకుడు. కె.వి.శ్రీరామ్ నిర్మాత. ఫిబ్రవరి 27న జి5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని సోమవారం హైదరాబాద్‌లో మీడియాకు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘నా కెరీర్‌కి ఈ పాత్ర మైలురాయి లాంటిది.
ఇందులో నా పాత్ర తీరుతెన్నులు, మాడ్యులేషన్ కొత్తగా ఉంటాయి. ఇంతమంచి పాత్ర ఇచ్చిన ఈ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అన్నారు. ప్రతి ఒక్క తండ్రికీ కనెక్టయ్యే సిరీస్ ఇదని నిర్మాత కె.వి.శ్రీరామ్ పేర్కొన్నారు. రెండేళ్లు ఎంతో ఇష్టపడి ఈ కథ రాసుకున్నానని దర్శకుడు కృష్ణ పోలూరు చెప్పారు. ఇంకా ఇందులో కీలక పాత్రలు పోషించిన ఉదయభాను, గాయత్రిభార్గవి, వాసంతికలతోపాటు డైలాగ్ రైటర్ శృతి, డీవోపీ మహేష్, జీ తెలుగు ప్రతినిధి జయంత్ రాఘవన్ కూడా మాట్లాడారు.