ఆదిలాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను భేషరుతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సోమవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను పరామర్శించారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కి దొడ్డిదారిన మున్సిపాలిటీల చైర్మన్లను కైవసం చేసుకునేందుకు కుట్రలు చేస్తుందన్నారు. క్యాతనపల్లిలో 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచి బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా మంత్రి వివేక్ తన అధికారాన్ని ఉపయోగించి పోలీసులను ఉపయోగించి రెండుసార్లు చైర్మన్ ఎన్నిక కాకుండా అడ్డుకున్నారన్నారు.
ప్రభుత్వం బాల్క సుమన్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నదన్నారు. పాత కేసులు బయటకు తీసి బేయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌ను జైలులో ఉంచి క్యాతనపల్లి చైర్మన్ ఎన్నికలు జరపాలని మంత్రి వివేక్ చూస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్ బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. జగిత్యాల మాజీ జడ్వీ చైర్మన్ ధ్యావ వసంత, నాయకురాలు మూల విజయ ఉన్నారు.