బిజినేపల్లి/గోపాల్పేట/మునుగోడు/యాచారం, జనవరి 24 : కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాసంగి పంటలకు సరైన సమయంలో వేసేందుకు యూరియా దొరక్క సతమతమవుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సింగిల్ విండో కార్యాలయం, రైతు వేదిక వద్ద శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా పడిగాపులుకాశారు. నాలుగైదు రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి దుప్పట్లు, స్వెట్టర్లు కప్పుకొని క్యూకట్టారు. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోడంతో రైతులు మండిపడుతున్నారు. శనివారం ఉదయం 7 గంటల తర్వాత అధికారులు వచ్చి టోకెన్లు అందజేసి యూరియా పంపిణీ చేశారు. కాగా వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో శనివారం ఉదయం యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయానికి వెళ్లిన పలువురు రైతులు ఆధార్‌కార్డు, పట్టాపాస్‌పుస్తకం జిరాక్స్‌లను క్యూలో పెట్టి టోకెన్ల కోసం చాలాసేపు నిరీక్షించారు. తర్వాత స్టాక్ లేదని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
యాప్ రద్దు చేయాలని మునుగోడులో…
యూరియా మొబైల్ యాప్‌ను రద్దు చేయాలని, సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం రైతు సంఘం (సీపీఐ) ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్, వ్యవసాధికారికి వినతిపత్రాలు అందజేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రం మాట్లాడుతూ ఫర్టిలైజర్ వికాస్ యోజన యాప్ తీసుకురావడంతో రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ని పీఏసీఎస్ గోదాం వద్ద యూరియా కోసం శనివారం రైతులు బారులుతీరారు. టోకెన్లు తీసుకొని గంటల తరబడి క్యూలో నిరీక్షించా రు. యూరియా లారీ రాగానే ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు అదుపు చేయాల్సి వచ్చింది.