జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 7 : మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. 120 మంది రైతులు 4,500 క్వింటాళ్ల మక్కజొన్నను మార్కెట్‌కు విక్రయానికి తెచ్చారు. బస్తా తూకం బరువు పెంచాలని ట్రేడర్లు టెండర్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే బస్తాకు 49 కిలోలు తూకం వేస్తుండగా అదనంగా 1300 గ్రాములు తూకం వేయటం ఏమిటని రైతులు మండిపడ్డారు. అకాల ర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని కార్యాలయం వద్ద బైఠాయించారు. విషయాన్ని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు, మార్కెట్ కార్యదర్శి నవీన్ చేరుకొని ట్రేడర్స్, రైతులతో మాట్లాడి టెండర్లు మొదలు పెట్టారు.