Rythu Runa Mafi | నర్సింహులపేట, డిసెంబర్ 3: రుణమాఫీ చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకుడు మందుల యాకూబ్ మాట్లాడుతూ.. ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు. అధికారుల తప్పిదంతో రైతుల బ్యాంకు ఖాతాలకు వేరే రైతు ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయడంతో స మస్యలు ఏర్పడ్డాయని, పలుమార్లు అధికారులకు ద రఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. కుటుంబం యూనిట్‌గా తీసుకున్నప్పటికీ ఇతర కుటుంబాల వారిని అధికారులు జత చేయడంతో సమస్యలు ఉత్పన్నమైనట్టు తెలిపారు. అర్హులైన రైతులందరికి రుణమాఫీ చేయాలని, లేకపోతే రైతులతో కలిసి దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
రైతులను మోసం చేసిన రేవంత్ ; సీఎంపై రైతు జేఏసీ నేతల ఆగ్రహం
ఆర్మూర్‌టౌన్, డిసెంబర్ 3: సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారని రైతు జేఏసీ నేతలు మం డిపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని కుమార్నారాయణ్భవన్లో రైతు జేఏసీ ప్రతినిధులు ఇట్టెడి లింగారెడ్డి, ప్రభాకర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కో గ్రామంలో కనీసం 10 శాతం మందికి కూడా మాఫీ వర్తించలేదని స్పష్టం చేశారు. వంద శాతం రుణమాఫీ చేయడం బోగస్ అని, ఒక గ్రామంలో 300 మంది రైతులు ఉంటే అందులో నాలుగు విడతల్లో కలిపి 30 మందికి మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు.
సగం మందికే రుణమాఫీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తమని చెప్పి సగం మందికే చేసింది. నేను బ్యాంకులో రూ.1,42,000 క్రాప్‌లోన్ తీసుకున్న. సర్కారు ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. ఎన్నికలప్పుడు రైతు భరోసా అని చెప్పి ఇప్పటి వరకు దాని జాడేలేదు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్పి మోసం చేసి గద్దెనెకిండు. రైతుల పాపం ఊరికనే పోదు. వాళ్లని గోస పెట్టిన ప్రభుత్వం నిలబడ్డ చరిత్ర లేదు.
– మారెళ్ల రామయ్య, రైతు, ఖాసింపల్లి, భూపాలపల్లి
మాఫీ కాలే.. అప్పు పెరిగింది
నేను రూ.లక్ష, నా భార్య సుభద్ర రూ.90వేలు బ్యాంకులో పంట రుణం తీసుకున్నం. మిత్తితో కలిసి మొత్తం రూ. 2.50 లక్షలైనయ్. నా కొడుకు రూ. లక్షా 50వేలు తీసుకున్నడు. రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే మాఫీ కాదని అంటే అప్పు తీసుకొచ్చి రూ. 52 వేలు కట్టిన. ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. రేషన్ కార్డు లేకపోవడంతో నా కొడుకుకూ రుణ మాఫీ కాలేదు. కాంగ్రె స్ సర్కారు మాటలు నమ్మితే మరింత అప్పు అయ్యింది.
– జిట్టబోయిన వెంకటయ్య, రైతు, ఇప్పగూడం, స్టేషన్‌ఘన్‌పూర్
ఇప్పుడూ నా పేరు రాలేదు..
నాకు 5.10 ఎకరాల భూమి ఉన్నది. పంట సాగుకోసం దంతాలపల్లి బ్యాంకు లో 1.50 లక్షల రుణం తీసుకున్న. బ్యాంకు వాళ్లు రూ. 10,500 మిత్తి కడితే మాఫీ వస్తుందంటే కట్టిన. నాలుగో విడతలోనూ నా పేరు రాలే. సీఎం రేవంత్‌రెడ్డి 2లక్షలు తీసుకున్న ప్రతి ఒక్కరికీ రుణం మాఫీ చేశామంటున్నడు. కానీ మా ఊరిలో చాలామందికి రుణమాఫీ కాలే.
– జంగాల సోమలక్ష్మి, దంతాలపల్లి, మహబూబాబాద్
నెలల తరబడి తిప్పిస్తున్నరు
ఆధార్ కార్డు పేరు తప్పుగా పడింది. అం దుకే రుణమాఫీ రాలేద ని నెలల తరబడి తిప్పిస్తున్నరు. చెన్నారావుపేటలోని సహకార సం ఘంలో అప్పు తీసుకున్న. సొసైటీ, వ్యవసాయ అధికారులు పేరు తప్పుగా ఉందని, సరిచేస్తమంటున్నరు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేసినా నా పేరు మాత్రం రాలేదు. ఎన్నికలప్పు డు అందరికీ రుణ మాఫీ చేయిస్తమని చెప్పి ఇ ప్పుడు ఆధార్ కార్డు పేరు తప్పు ఉన్నదని, రేష న్ కార్డు లేదని చెప్తున్నరు.
-మర్రి మల్లయ్య, చెన్నారావుపేట, వరంగల్
వడ్డీ కట్టినా రుణమాఫీ కాలే..
కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.2.40 లక్షలు రుణం తీసుకున్నాం. కొత్త ప్రభుత్వం రాగానే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పినా.. మాకు మాఫీ వర్తించలేదు. బ్యాంకు అధికారులను అడిగితే రూ.40 వేలు కట్టండి.. రూ.2 లక్షలు రుణమాఫీ అవుతుందని చెబితే కట్టేశాం. ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం ఇట్ల చేస్తదని అనుకోలే.
– ధర్మసోతు క్రాంతి, మహిళా రైతు, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పేరు తప్పు ఉందని తిప్పారు..
అకౌంట్లో పేరు తప్పు పడ్డది ..అందుకే రుణమాఫీ కాలేదని నాలుగు నెలలుగా తిప్పుతున్నారు. నేను ఎదులాపురం సొసైటీలో తీసుకున్న అప్పు, అసలు కలిపి రూ.1.30 లక్షలు. నాకు అప్పట్లోనే రుణమాఫీ రావాల్సి ఉంది. ఆధార్‌కార్డులో ఇం కో పేరు కనపడుతుందని చెప్పారు. కొద్దిరోజుల తరువాత సొసైటీ వాళ్లు పేరు మార్చి నా పేరు పెట్టామని ఓ కాగితం కూడా ఇచ్చారు. అది తీసుకు పోయి ఏఈవోకు ఇవ్వగా వచ్చే జాబితాలో పేరు వస్తది అన్నారు. ఈ రోజు మళ్లీ వచ్చి అడిగితే మళ్లా వేరే అతని పేరే కనపడుతున్నదని చెప్తున్నారు.
– బుర్ర ఉప్పలయ్య, కొండాపురం, ఖమ్మం