యాచారం, నవంబర్ 8: ఫార్మాసిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు పదవులు పొందగానే రైతులను పూర్తిగా విస్మరించారని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయ కర్తలు కవుల సరస్వతి, కుందారపు నారాయణ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు కానమోని గణేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని, భూములను తీసుకోబోమని చెప్పిన కాంగ్రెస్ నేడు మాట మార్చిందని మండిపడ్డారు.
ఎన్నికల ముందు రైతులతో కలిసి పాదయాత్ర చేసి నేడు పదవులు పొందిన డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క, మంత్రు లు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్ల న్న, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఫార్మా భూ బాధిత రైతులను మరిచిపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు ఫార్మాసిటీని రద్దు చేస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఫార్మాసిటీకి తీసుకున్న భూములను తిరిగి రైతుల పేరిటే ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ చేయాల్సింది మూసీ ప్రక్షాళన కాదని విషం వెదజల్లే ఫార్మాసిటీని ముందు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఫార్మా బాధిత రైతులే తగిన బుద్ధి చెబుతారని వెల్లడించారు.