హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆదివారం నుంచి మక్కల కొనుగోళ్లు నిలిపివేయాలని సర్కార్ తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఓవైపు కొనుగోలు కేంద్రాల్లో మక్కల కుప్పలు ఉన్నాయి. రైతులు నేటికీ మక్కలను తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్కార్ ఉన్నపళంగా మక్కల కొనుగోలును బంద్ చేయాలనే నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి మక్కల కొనుగోళ్లను ఆపేయాలని, కేంద్రాలను మూసివేయాలని మార్క్ఫెడ్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మక్క రైతుల్లో ఆందోళన నెలకొన్నది. పంటను బహిరంగ మార్కెట్లో అమ్ముకుందామనుకుంటే ప్రైవేటు వ్యాపారులు అడ్డికి పావుశేరు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు రుతుపవనాల రాకతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతున్నది. సర్కారు కొనుగోలు బంద్ చేస్తే మిగిలిన పంట వర్షార్పణం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ యాసంగి పంటల కొనుగోలులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా మక్క, జొన్న రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. మక్కల కొనుగోలుపై మొదటి నుంచీ ప్రభుత్వం ఆసక్తిగా లేదు.. కానీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తప్పని పరిస్థితుల్లో కొనుగోలు ప్రారంభించింది. ఈ సీజన్లో 43 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి అయ్యాయి. ఇందులో 22 లక్షల టన్నుల మక్కల్ని కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఇప్పటి వరకు 15 లక్షల టన్నుల లోపే కొనుగోలు చేసింది. అంటే లక్ష్యానికి ఇంకా 7 లక్షల టన్నులు తక్కువగానే కొనుగోలు చేసింది.
వాస్తవానికి ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు ఉన్నాయి. రైతులు సైతం ఇంకా కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ప్రతి రోజు 5-10వేల టన్నుల మధ్య కొనుగోలు చేస్తున్నది. శనివారం కూడా 7వేల టన్నులు కొనుగోలు చేసింది. అయినప్పటికీ మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను మూసివేయాలనే నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి కూడా 20కి పైగా కేంద్రాల్లో కొనుగోలు జరుగుతూనే ఉన్నది. కొన్ని కేంద్రాల్లో ప్రతి రోజు 500 టన్నులకు పైగా మరికొన్ని కేంద్రాల్లో అయితే వెయ్యి టన్నులకు పైగా కొనుగోలు చేశారు. అయినప్పటికీ మక్కలు రావడంలేదంటూ కొనుగోలు కేంద్రాలను మూసివేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.