శివ్వంపేట, మే 19 : కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి నెల రోజులవుతున్నా కాంటా వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేటలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఓవైపు అకాల వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడుస్తున్నదని, పంటను కాపాడుకోవడం ఓ వంతైతే కాంటా వేయడం మరోవంతుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందారు. కొనుగోలు కేంద్రం వద్ద కనీస వసతులు లేవని, వెంటనే అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై కూర్చున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై మధుకర్‌రెడ్డి రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు.
వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం శివ్వంపేటలో రైతులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకొని అక్కడికి చేరుకుని బాధిత రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు రోజులకో లారీ మాత్రమే లోడ్ చేస్తే కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తారని నిర్వాహకులను ప్రశ్నించారు. లారీల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు సోమవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో రోడ్డెక్కారు. మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ధాన్యాన్ని తరలించకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయని, అదీగాక బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడించారు. ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీతో శాంతించారు. – చిలిపిచెడ్
ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం విక్రయానికి తరలించి నెలలు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
-తిరుమలాయపాలెం
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఇవ్వడంలేదని, ధాన్యం కొనడంలేదని వనపర్తి జిల్లా చిన్నమందడిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనేవారు లేరని, వర్షాలకు ధాన్యం తడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహంవ్యక్తంచేశారు. వర్షానికి ధాన్యం తడిచి మొలకలు వస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
-పెద్దమందడి
ధాన్యం విక్రయించి నెలలు గడుస్తున్నా ఖాతాల్లో డబ్బులు పడలేదని రైతులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో రాయిచూర్-మహబూబ్‌నగర్ రహదారిపై ధర్నా చేశారు. సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు ఎదురవుతున్నా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తంచేశారు. చాలాచోట్ల కనీసం గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
-మక్తల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దతూండ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. కాంటాలు పెట్టి ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు.
-మల్హర్
మిల్లర్ సన్న వడ్లను దించుకోవడం లేదంటూ మహబూబాబాద్ జిల్లా తొ ర్రూరులోని వెంకటలక్ష్మి మిల్లు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. మిల్లు గేటు మూసి నిరసన తెలిపారు. అక్కడికి వచ్చిన జిల్లా పౌరసరఫరాల అధికారిని నిలదీశారు. ధాన్యం తీసు కోవాలని మిల్లు యాజమాన్యాన్ని అధికారి ఆదేశించినట్టు రైతులు తెలిపారు.
– తొర్రూరు