తొర్రూరు ఆగస్టు 28 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో యూరియా కొరతపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట వందలాది మంది రైతులు గుమికూడారు. యూరియా లేకపోవడంతో భగ్గుమన్న రైతులు ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. యూరియాను సమయానికి అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎప్పుడూ యూరియా కొరత రాలేదని, అవసరమయ్యేంత బస్తాలు సకాలంలో అందించేవారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలకే పరిమితం చేస్తూ, వాటికి నానో యూరియా లింక్ చేసి రైతులపై అదనపు భారాన్ని మోపుతోందని తీవ్రంగా విమర్శించారు. అలాగే తొర్రూరు డివిజన్లో ప్రభుత్వ యూరియా సరఫరాను తగ్గించి, ప్రైవేట్ దుకాణాలకు బ్లాక్‌గా విక్రయిస్తున్నారని ఆరోపించారు. రైతులు తమ కష్టసుఖాలు పట్టించుకోని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతు సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను అర్ధం చేసుకుంటూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ధర్నాలో మాలోత్ యాకన్న, ఉపేందర్, నరసయ్య, ఉప్పలన్న, శ్రీనివాస్ రాజు, గంగాధర్, ముఖేష్, మంజుల, వెంకటమ్మ, లాలు, వీరన్న, సురేష్, మహేష్, ఉపేందర్, మధు తదితర రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.