Soybean | హైదరాబాద్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): రైతులను గాలికొదిలేస్తూ సోయాబీన్ కొనుగోలుపై కాంగ్రెస్ సర్కారు చేతులెత్తేసింది. కొనుగోలు భారాన్ని కేంద్ర ప్రభుత్వంపైనే మోపింది. ‘మేం కొనలేం.. మీరే కొనండి’ అంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోయాబీన్ పంటను కొనుగోలు చేసి, రైతులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. వరుస గా కురిసిన భారీ వర్షాలతో సోయాబీన్ పంట భారీగా దెబ్బతిన్నదని ఆ లేఖలో పే ర్కొన్నారు. వర్షాలతో తడవడంతో దిగుబడులు నిబంధనల కు అనుగుణంగా లేవని, కొనుగోలు చేయ డం సాధ్యంకాదని పేర్కొన్నారు. నిబంధనలను సడలించి కేంద్రమే కొనాలని కోరా రు. సోయా కొనుగోలు చేయకపోవడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గిరిజన రైతులు సోయాను ప్రధానంగా సాగు చేస్తున్నారని తెలిపారు.
5 జిల్లాల్లో యూరియా యాప్
యూరియా పంపిణీ కోసం యాప్ను ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఆయా జిల్లాల్లో ఇప్పటికే విజయవంతమైందని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్, జనగామ, మహబూబ్నగర్, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో రెండు రోజులుగా 19,695 మంది రైతులు 60,510 బస్తాలను బుక్ చేసుకున్నట్టు తెలిపారు. 217 మంది కౌలు రైతులు 678 బస్తాలను బుక్ చేసుకున్నట్టు పేర్కొన్నారు.