రాయికల్/జూలపల్లి/సంగారెడ్డి, మే 23: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో కొనుగోలుకేంద్రంలో వడ్లు కొనడం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించారు. ‘అకాల వర్షాలతో వడ్ల కుప్పలు తడిసి ముద్దవుతున్నయ్. ధాన్యం ఇంకెప్పుడు కొంటరు?’ అంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
లారీలు, హమాలీల కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. తడిసిన ధాన్యం కొనడం లేదని సంగారెడ్డి మండలం కులబ్గూర్ శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు కేంద్రం నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఈ కేంద్రానికి పలువురు రైతులు తడిసిన ధాన్యాన్ని తీసుకురాగా.. మ్యాచర్ రాదని, ఇక్కడే ఆరబెడితే ఎండిన తర్వాత ఆ ధాన్యానికి కాంటా వేస్తామని సిబ్బంది చెప్పడంతో రైతులు మండిపడ్డారు.