నర్సింహులపేట, డిసెంబర్ 2 : రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట రైతు వేదిక వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రూ.55 వేల నుంచి రూ.2లక్షల లోపు పంటరుణం ఉన్నా తమకు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో తమ బ్యాంకు ఖాతాలకు ఇతరుల ఆధార్‌కార్డు నంబర్లు నమోదు చేయడంతో మొదటి విడతలో రుణమాఫీ కాలేదని, అధికారులకు దరఖాస్తు చేసినా ఫలితం లేకుండాపోయిందని వెల్లడించారు.
వ్యవసాయ అధికారులు కావాలనే తమ సెల్ఫీ ఫొటోలు తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న రైతులకు రుణమాఫీ చేసేవరకు దీక్ష చేపడుతామని కేవీపీఎస్ జిల్లా నాయకుడు మందుల యాకూబ్ తెలిపారు. ఈ సందర్భంగా పెద్దనాగారంస్టేజీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు, రైతు బొబ్బ అశోక్‌రెడ్డి ఏవో వినయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగాడు.