నల్లబెల్లి, మార్చి 4: ధాన్యం డబ్బులు చెల్లించాలని ఓ రైతు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టాడు. ఈ సందర్భంగా బాధిత రైతు గాజుల రాజేందర్ మాట్లాడుతూ.. 309 బస్తాల ధాన్యాన్ని మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు విక్రయించగా, నిర్వాహకులు కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వకుండా మూడు నెలలుగా తిప్పుతున్నారని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలితో మాట్లాడాడు. రైతుకు రావాల్సిన డబ్బుల్లో ప్రస్తుతం రూ.1.45 లక్షలు అక్కడికక్కడే ఇప్పించారు.
ధాన్యం కొనుగోలుదారురాలి భర్త బత్తిని మహేశ్ (కాంగ్రెస్ నాయకుడు) తమకు సమాచారం ఇవ్వకుండా రాజేందర్‌కు చెందిన ధాన్యాన్ని ట్రాక్టర్ ద్వారా నేరుగా మిల్లుకు దిగుమతి చేసి, డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకొని తన సొంతానికి వాడుకున్నట్టు ఏపీఎం సునీతను తెలిపింది. రైతులకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేకపోవడంతో డీఆర్డీఏతోపాటు సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ద్వారా వివరాలు సేకరించడంతో మహేశ్.. రైతుల డబ్బులను వాడుకున్న విషయం బహిర్గతమైందని అన్నారు. ఇలా చాలామంది రైతుల ధాన్యాన్ని నేరుగా మిల్లులకు విక్రయించి డబ్బులను తన ఖాతాలోకి మళ్లించుకొని ఆలస్యంగా రైతులకు చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే గ్రామానికి చెందిన రమ అనే రైతుకు సంబంధించిన ధాన్యం డబ్బులు రూ.45 వేలకుపైగా మహేశ్ వాడుకున్నాడని తెలిపారు.