అర్వపల్లి, మే 28 : నెలలు గడుస్తున్నా ధాన్యాన్ని కాంటా వేయడం లేదని, వర్షానికి ధాన్యం మొలకెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం బొల్లంపల్లిలో 356వ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. స్థానిక పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో నెల రోజులు దాటినా కాంటాలు వేయడం లేదని, కొనుగోలు చేసినా ట్యాబ్‌లో నమోదు చేయడం లేదని, ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదంటూ మండిపడ్డారు. ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న తమకు చావే శరణ్యమంటూ మహిళా రైతు చింతల సైదమ్మ పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగింది. బస్తాకు మూడు కిలోలు కట్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో 4 లారీలకు సరిపడా ధాన్యం తడిసి ముద్దయి మొలకలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులకు ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. దాదాపు రెండు గంటలపాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి.
కాంటా పెడ్తలేరని ధాన్యానికి నిప్పు
కొనుగోలు కేంద్రంలో కాంటా పెడ్తలేరని ఆగ్రహించిన ఓ రైతు తన ధాన్యానికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం ముక్తాపూర్(ముఠాపూర్)లోని పీఏసీఎస్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకున్నది. మూఠాపూర్కు చెందిన రైతు ఆదుముల్ల శ్రీధర్ 20 రోజుల క్రితం 200 బస్తాల వడ్లను తీసుకొచ్చాడు. అధికారులు తూకం వేయకుండా జాప్యం చేస్తున్నారు. దీంతో కడుపు మండి బుధవారం పీఏసీఎస్ కార్యాలయంలోనే ధాన్యానికి నిప్పు పెట్టాడు.
ధాన్యం లోడ్‌తో కలెక్టరేట్‌కు..
మిల్లర్ వడ్లు దించుకోకపోవడంతో బుధవారం ఓ రైతు నేరుగా ధాన్యం లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌కు తీసుకు వచ్చి నిరసనకు దిగాడు. గట్టు మండలం తప్పెట్లమొర్సుకు చెందిన రైతు శ్రీనివాసులు ధాన్యాన్ని గట్టులోని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. వారి సూచన మేరకు మాచర్లలోని మిల్లుకు తీసుకెళ్లాడు. మిల్లర్ నిరాకరించడంతో నేరుగా ట్రాక్టర్ లోడ్‌తో కలెక్టరేట్‌కు వెళ్లి నిరసన తెలిపాడు. – గద్వాల