హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ)/మోర్తాడ్/ఎల్లారెడ్డి/తాడ్వాయి : యూరియా యాప్ వద్దు.. షాపులోనే అమ్మాలని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నా సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. చదువు రాని తమకు యాప్‌లో బుక్ చేయడం రాదని ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టనట్టు ప్రవర్తిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి జాజాల సురేందర్ ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో మంగళవారం వంటావార్పు కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నదని, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటాయనే అనుమానంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో సర్కార్ తీరును నిరసిస్తూ ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మరోవైపు, తాడ్వాయికి వచ్చేందుకు సిద్ధమైన మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా హైదరాబాద్‌లో గృహనిర్బంధం చేశారు. అలాగే, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ వందలాది మంది నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు.
తాడ్వాయిలో బీఆర్ఎస్ తలపెట్టిన వంటావార్పును విఫలం చేసేందుకు పోలీసులు మంగళవారం తెల్లవారుజాము నుంచే నిర్బంధాల పర్వం ప్రారంభించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, గాంధారి, కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ మండలాల పరిధిలోని కీలక నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాలకు తరలించారు. తాడ్వాయికి వచ్చే మార్గాలను దిగ్బంధించడంతోపాటు చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి బస్సులు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేసి అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు రైతులను పోలీసు వ్యాన్లలో ఎత్తిపడేశారు. జాజాల సురేందర్ మాజీ ఎమ్మెల్యే అన్న స్పృహలేకుండా అమాంతం ఎత్తి పోలీస్ వ్యాన్‌లో పడేశారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను సైతం పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పోలీసుల కండ్లుగప్పి తాడ్వాయికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తెల్లవారుజామునే పోలీసులు చేరుకోగా, వారికి చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. సామాన్య రైతులా తాడ్వాయికి బైక్‌పై వచ్చిన ఆయన ‘జై తెలంగాణ, జై బీఆర్ఎస్’ అంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఎర్రపహాడ్ సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి పెట్రోల్ బాటిల్‌తో ఆందోళన తలపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు బాటిల్ లాక్కొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
తాడ్వాయిలో తలపెట్టిన బీఆర్ఎస్ నిరసనకు వెళ్లకుండా ప్రశాంత్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి మద్దతు తెలిపారు. రైతుల తరఫున ప్రశ్నించే నాయకులను అణచివేయాలని ప్రభుత్వం చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల సమస్యలను లేవనెత్తిన వారిపైకి పోలీసులను ప్రయోగించడం దారుణమంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా కొరతతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియా పంపిణీలో అమలుచేస్తున్న యాప్ విధానం రైతులకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో పోలీసులు హౌస్ అరెస్టు చేసిన సందర్భంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ బాధలు చెప్పుకోకుండా రైతుల గొంతు నొక్కేందుకు రేవంత్ ప్రభుత్వం అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. రేవంత్‌ది ప్రజాపాలన కాదు, నియంతృత్వ, నిరంకుశ, నిర్బంధ పాలన అని ధ్వజమెత్తారు. మమ్మల్ని అరెస్టు చేసి మా గొంతు నొక్కే బదులు, అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ హయాంలో అన్ సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా అందుబాటులో ఉన్నా కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచేవారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి దృష్టంతా హైదరాబాద్‌లో భూములు ఎక్కడున్నాయి, వాటిని ఏం చేయాలనే దానిపైనే ఉన్నది తప్ప, రైతుల బాధలు పట్టవని విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో, వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాయని ధ్వజమెత్తారు.