న్యూఢిల్లీ, జూలై 23: దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్నది. అస్తవ్యస్తమైన గ్రామీణ భారతం ముఖచిత్రాన్ని వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ (నాబార్డ్) తాజా అధ్యయనం ఒక్కటి ఆవిష్కరించింది. గ్రామీణ ఆర్థిక పరిస్థితులు-సెంటిమెంట్స్ సర్వేలో కుటుంబస్తుల ఆదాయం పడిపోతున్నదని, వారి కొనుగోలు శక్తి తగ్గుతున్నదని, ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతుండగా.. పొదుపునకు దూరమై, అప్పులతో అవసరాలు తీర్చుకుంటూ, నమ్మకం లేని జీవితాలను గడుపుతున్నారని తేలింది మరి.
దాదాపు రెండేండ్ల క్రితం (2024 సెప్టెంబర్) ఈ ద్వైమాసిక సర్వేను నాబార్డ్ మొదలుపెట్టగా.. గ్రామాల్లో ఇంత అధ్వానంగా పరిస్థితులు ఎప్పుడూ కనిపించకపోవడం గమనార్హం. ఆర్థికంగా చితికిపోతున్న ఎన్నో గ్రామీణ కుటుంబాలు.. స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నాయి. ఇక అప్పు పుట్టనివారు బంధువులు, మిత్రుల వద్ద చేయి చాచాల్సిన దుస్థితి నెలకొన్నదని సర్వే చెప్తున్నది. దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది.
తాజా సర్వేలో ఏడాది క్రితంతో పోల్చితే ఆదాయం పెరిగిన గ్రామీణ కుటుంబాలు 27.7 శాతంగానే ఉన్నాయి. సర్వే మొదలైనప్పట్నుంచి చూస్తే ఇదే కనిష్ఠ స్థాయి. ఇక 52.6 శాతం కుటుంబాల ఆదాయం యథాతథంగానే ఉండగా.. 19.8 శాతం మందిది పడిపోయినట్టు స్పష్టమైంది. గత ఏడాది నవంబర్ నుంచి గ్రామీణుల ఆదాయం క్రమేణా క్షీణిస్తున్నట్టు సర్వే పేర్కొనడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నదిప్పుడు.
ఇక పెరుగుతున్న ధరల దెబ్బకు గ్రామీణుల ఆదాయం అంతకంతకూ బలహీనపడుతున్నది. నిజానికి గ్రామా ల్లో అత్యధికుల జీవనాధారం వ్యవసాయమే. ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు.. ఇప్పుడు పంటల సాగునే ప్రశ్నార్థకం చేస్తున్నది. కొనుగోళ్లు పడిపోయి వ్యాపారాలూ ప్రభావితమవుతున్నాయి. జూలై లో వినియోగ వ్యయం 74.1 శాతానికి దిగజారింది. మే నెలలో ఇది 77.2 శాతంగా, నిరుడు జూలైలో 76.6 శాతంగా ఉన్నది. ఇక ఆదాయం లేక పొదుపు వైపే గ్రామీణులు చూడట్లేదని సర్వే చెప్తున్నది.