హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ) : క్యాన్సర్ నివారణ జాతీయ ప్రాధాన్యతగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో క్యాన్సర్ రోగుల కోసం ఏర్పాటు చేసిన పెయిన్, పాలియేటివ్ కేర్ విభాగం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ క్యాన్సర్ రోగుల కోసం పెయిన్, పాలియేటివ్ కేర్ సేవలను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. అంకాలజిస్టులు, పాలియేటివ్ కేర్ నిపుణులు కలిసి పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆధునిక వైద్యం చెబుతున్నదని అన్నారు. ఈ చికిత్స ప్రధాన చికిత్సలతో పాటు సమాంతరంగా పనిచేస్తూ రోగి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ చైర్మన్ గోపీచంద్ మన్నం, డైరెక్టర్ రమేశ్ గూడపాటి, మెడికల్ అంకాలజీ విభాగాధిపతి సాయినాథ్ పాల్గొన్నారు.