శంకరపట్నం, ఫిబ్రవరి 10 : అందుబాటులో యూరియా బస్తాలు ఉన్నా మొబైల్ యాప్‌లో బుక్ కావడం లేదని, ఈ దిక్కుమాలిన అప్లికేషన్ తమకొద్దంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో రైతులు మంగళవారం ఫర్టిలైజర్ దుకాణం ఎదుట నిరసన తెలిపారు. శంకరపట్నం మండలానికి 330 బస్తాలు అందుబాటులో ఉన్నట్టు యాప్‌లో డిస్ప్లే అవుతున్నదని, ఎంత ప్రయత్నించినా బుకింగ్ కావడం లేదని వాపోయారు. సాధారణ ఫోన్లు వాడే రైతులు ఎలా బుక్ చేసుకుంటారని ప్రశ్నించారు. రోడ్డుకు పై ధర్నా చేసిన అనంతరం యాప్‌లో యూరియా బుక్ అవుతున్నట్టు తెలిసి ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లారు. యాప్‌లో రెండు నిమిషాల వ్యవధిలోనే యూరియా నిల్ అని చూపడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరాశతో వెళ్లిపోయారు. మానకొండూర్ ఏడీఏ శ్రీధర్‌ను వివరణ అడుగగా సాంకేతిక లోపం వల్ల ఉదయం యాప్‌లో బుక్ కాలేదని, తర్వాత కొద్దిసేపటికే సమస్య పరిష్కారమైందని వెల్లడించారు.
మునగాల, ఫిబ్రవరి 10 : వ్యవసాయమే తన జీవితం అనుకున్న రైతులు రాష్ట్రంలో యూరియా దొరక్క, యాప్‌లో బుక్ చేసుకోవడం తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం బారాకత్గూడెంకు చెందిన కౌలు రైతు చల్ల సైదులు 15 ఎకరాల్లో వరి సాగుచేశాడు. ఇందులో 3 ఎకరాలు ఎర్రబడింది. యూరియా దొరక్క పోవడంతో పంటను కాపాడుకోవడానికి నూకలలో 3 బీర్లు కలిపి పొలానికి స్ప్రే చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు టచ్ ఫోన్ లేదని, కీ ప్యాడ్ ఫోన్ వాడటం కూడా తెలియదని , అలాంటి మేము యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలని ఆవేదన వ్యక్తంచేశాడు. రూ. 250 యూరియా బస్తా కోసం రూ.20 వేల ఫోన్ కొనాల్సివస్తున్నదని వాపోయాడు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు ఏనాడూ యూరియా కోసం ఇబ్బందులు పడలేదని గుర్తుచేశారు. ఇప్పుడు సొసైటీల వద్ద రోజుల తరబడి వేచిఉన్నా యూరియా దొరకడంలేదని ఆరోపించాడు.