హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకే దొంగదీక్షలు అలవాటు అని, తమకు ఆ ఖర్మ పట్టలేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న రైతు దీక్ష తాము ఊహించిన దానికన్నా ఎకువ విజయవంతమైందని తెలిపారు. ఇది జీర్ణించుకోలేకే కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచేందుకు రైతుదీక్ష చేపట్టినట్టు చెప్పారు. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడుతున్నందుకు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే కేటీఆర్‌పై తప్పుడు కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి చూపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీల అమలుపై రేవంత్‌రెడ్డితో చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.