కోటగిరి, అక్టోబర్ 23: కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట కోత విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రైతులు గురువారం ఆందోళనకు దిగారు. మొన్నటి వరకు బస్తా 41 కిలోల చొప్పున తూకం వేశారని, నాలుగు రోజులుగా తరుగు పేరిట మరో 500 గ్రాములు అదనంగా కాంటా వేస్తున్నారని మండిపడ్డారు. తరుగు పేరిట అదనంగా కిలోన్నర తూకం వేస్తున్నారని, పైగా ధాన్యం లారీ మిల్లుకు వెళ్లాకా అక్కడా మరో 2 కిలోల తరుగు ఇవ్వాలని రైస్‌మిల్లర్లు ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రెండు గంటల పాటు కోటగిరి- పొతంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి సముదాయించే ప్రయత్నం చేయగా రైతులు భీష్మించారు.
రైస్‌మిల్లర్లు ఏకమై తమ శ్రమను దోచుకుంటున్నారని కోటగిరికి చెందిన ఓ రైతు పురుగు మందు తాగేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. మందు డబ్బాను లాక్కుని రైతును సముదాయించారు. చివరకు తహసీల్దార్ గంగాధర్ రాగా, రైతులు తమ గోడువెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలతో దిగుబడి తగ్గిపోయి ఇబ్బంది పడుతుంటే, కిలోన్నర అదనంగా కాంటా వేస్తున్నారని, మరో పక్క రైస్‌మిల్లర్లు రైతులను తరుగు పేరిట మరో రెండు కిలోలు కోత విధిస్తూ దోపిడీ చేస్తున్నారని ఆవేదనచెందారు. మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి, తరుగు లేకుండా చూస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.