నాగర్‌కర్నూల్/తిరుమలాయపాలెం/వైరా టౌన్/పెనుబల్లి, ఏప్రిల్ 18: మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సత్వరం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. నాగర్‌కర్నూల్‌తోపాటు ఖమ్మం జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ సమీపంలో నాగర్‌కర్నూల్-శ్రీశైలం ప్రధాన రహదారిపై నెల్లికొండ చౌరస్తా వద్ద రోడ్డుపై రైతులు బైఠాయించారు. ముళ్ల కంపను రహదారిపై అడ్డంగా వేసి ధర్నా చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. వారం రోజులుగా తాము మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చినా కొనుగోలు చేపట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కాంటా వేశాక గోదాములకు తరలించకపోవడంతో మార్కెట్ అంతా మక్కలతో నిండిపోయిందని అన్నారు. మార్కెట్లో తిండీతిప్పలు మానుకొని ఉంటున్నారని వాపోయారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్సై గోవర్ధన్, పోలీసులతో అక్కడికి చేరుకొని రైతులను మార్కెట్ వరకు తరలించారు. మక్క జొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెనుబల్లి తహసీల్, ఐకేపీ కార్యాలయం ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కొణిజర్లలోని రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో అంతరాయం ఏర్పడింది.