ముథోల్, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని విట్టోలి గ్రామంలో కరెంటు సమస్యను(Current issues) నిరసిస్తూ రైతులు సోమవారం ముథోల్‌లోని సబ్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు(Farmers protest). ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విట్టోలి గ్రామానికి చెందిన ఫీడర్లో సమస్య ఉండడంతో మూడు, నాలుగు రోజుల నుంచి కరెంటు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు.
కరెంటు పోయిన తర్వాత సమాచారం ఇచ్చినా కూడా లైన్‌మన్ శ్రీమన్నారాయణ దాదాపు 4 నుంచి 5 గంటల వరకు సరిచేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మక్క చుంచు దశలో ఉన్న సమయంలో కరెంట సమస్య రావడంతో తీవ్రంగా నష్టపోతామని వాపోయారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. విట్టోలి ఫీడర్ సమస్యను సోమవారంతో పూర్తి చేసినట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో వైర్లు కిందికి వచ్చి పోల్స్ విరగడంతోనే సమస్య ఏర్పడిందని దాని పరిష్కారానికి ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని వివరించారు.