ఆరు నెలలుగా కరెంట్ సరిగ్గా ఉండటం లేదంటూ నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్స్టేషన్ ఎదుట ఊర్కొండపేట గ్రామస్థులు, రైతులు ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో గురువారం సబ్స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి గ్రామంలో కరెంట్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నపాటి వర్షం కురిసినా కరెంట్ కోతలు విధిస్తున్నారని విమర్శించారు.అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఏఈ రమణి, ఎస్సై వీరబాబు అక్కడికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
– ఊర్కొండ
రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలి
నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద 17 ఏండ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట రెండో ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉపకార్యదర్శి నరసింహ మాట్లాడుతూ.. శాశ్వత ఉద్యోగాల కోసం గతేడాది ఆగస్టులో సమ్మె నిర్వహించినప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కచ్చితంగా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తోట రామాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని శ్యామల, సహాయ కార్యదర్శులు పద్మ, జయమ్మ, ఉపాధ్యక్షురాలు హారతి, రాజేశ్వరి, గుణవతి, తమ్మిశెట్టి జయమ్మ, యధాలక్ష్మి, పాయం సరోజ పాల్గొన్నారు.
-హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)
ఏటూరునాగారం ఐటీడీఏ వద్ద గిరిజనుల ధర్నా
ములుగు జిల్లా వాజేడు మండలం సర్వే నంబర్ 11లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారికి హక్కు పత్రాలు, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఏటూరునాగారం ఐటీడీఏ వద్ద గురువారం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ నిరుపేదలు గుడిసెలు వేసుకుని ఎనిమిది నెలలు కావస్తుందని, వారికి వెంటనే హక్కు పత్రాలు ఇవ్వడంతోపాటు తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.
– ఏటూరునాగారం
జీతాల కోసం ఎత్తిపోతల పథకం కార్మికుల ధర్నా
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గుత్ప, అలీసాగర్ లిప్టు ఇరిగేషన్ కార్మికులు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లా నవీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రెండు ఎత్తిపోతల పథకాల్లో పనిచేసే 120 మందికి ఐదు నెలలుగా జీతాలు లేక పస్తులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
– నవీపేట