రాష్ట్రంలో యూరియా కొరతకు అద్దం పడుతున్నదీ దృశ్యం. ఒక్క బస్తా దక్కినా పంటను కాపాడుకోవచ్చునన్న రైతన్న తపనకు ఇదే సాక్ష్యం. ఇప్పటికీ రాష్ట్రంలో యూరియా కొరతే లేదంటూ ప్రకటనలిస్తున్న మంత్రులు అంగీకరించలేక పోతున్న నిష్ఠుర సత్యమిది. రంగారెడ్డి జిల్లా మంచాల సింగిల్విండో కార్యాలయం వద్ద గురువారం తెల్లవారుజామునుంచే ఎదురు చూసిన వందలమంది రైతులు.. యూరియా లారీ రాగానే టోకెన్లు పట్టుకొని ఇలా ఎగబడ్డారు. అంతాచేస్తే యూరియా దక్కింది కొందరికే. మిగిలినవారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
మంచాల, జనవరి 22: అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న రైతులు గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో చేరుకొన్నారు. గంటల తరబడి క్యూలో ఉన్నా ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. యూరియా లోడుతో వచ్చిన లారీ వద్దకు పరుగెత్తారు. వ్యవసాయ శాఖ, సహకార సంఘం అధికారులు రైతులను అదుపుచేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు ససేమిరా అంటూ యూరియా కోసం ఎగబడ్డారు.
మంచాల సీఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి క్యూలో నిలబెట్టారు. ముందు వరుసలో ఉన్న రైతులకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో ఇది ఏ మాత్రం సరిపోదని మండిపడ్డారు. యూరియా కొందరికే దొరుకడంతో ప్రభుత్వంపై అసహనాన్ని వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచే యూరియా కష్టాలు మొదలయ్యాయని వాపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికే ప్రతి పంట నాటువేసే సమయంలో యూరియా కోసం తిండీతిప్పలు మాని బస్తాల కోసం క్యూలో నిలబడాల్సి వస్తున్నదని ఆవేదన చెందారు. రాష్ట్రంలో రైతుల కష్టాలు తెలిసిన ప్రభుత్వమే అధికారంలో ఉంటే తమకు ఈ కష్టాలు ఉండేవి కావని చెప్పుకొచ్చారు.