Rythu Deeksha | మహబూబ్నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మద్దూరు: సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు నిరసన దీక్ష కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది. రైతు నిరసన దీక్షను భగ్నం చేయాలని కాంగ్రెస్ నాయకులు పన్నిన కుట్రలను ఛేదించుకుంటూ భారీఎత్తున రైతులు తరలివచ్చారు. కేటీఆర్ సభకు వెళ్లొద్దంటూ చాలా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్ బిర్యానీలు పెట్టినా అక్కడ తిని కేటీఆర్ సభకు వెళ్లడంతో కంగుతిన్నారు.
బీఆర్ఎస్ రైతు మహాధర్నా సక్సెస్ కావడంతో కాంగ్రెస్లో గుబులు రేగుతున్నది. రేవంత్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల అరాచకాలపై రైతు ధర్నాలో కేటీఆర్ దుమ్మెత్తిపోశారు. కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు జనం కదలకపోవడం గమనార్హం. మధ్యాహ్నం ఒంటిగంటకు రైతుదీక్ష ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ 12 గంటలకే రైతులు, మహిళలు పెద్దఎత్తున సభా ప్రాంగణానికి తరలివచ్చారు. కేటీఆర్ రాక కోసం కోస్గి శివారులో వేలాదిమంది రైతులు ఎదురుచూశారు. మధ్యాహ్నం 3 గంటలకు కేటీఆర్ లగచర్ల రైతులకు హకీంపేటలో సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైన ర్యాలీ సభావేదికకు వచ్చేందుకు 45 నిమిషాలు పట్టింది. ఎక్కడ చూసినా జనమే జనం. రైతులు కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. దారి పొడవునా పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.