నాడు తెలంగాణపై సీమాంధ్రుల కుట్రలకు వ్యతిరేకంగా ఎగిసిన ‘మానుకోట రాళ్లు’ మళ్లీ లేశాయి. సరిపడా యూరియా అందించని కాంగ్రెస్ సర్కారు తీరుపై కడుపుమండి..శనివారం మహబూబాబాద్‌లోని పీఏసీఎస్‌కు ఎరువుల లోడ్‌తో వచ్చిన లారీపై రాయి విసురుతున్న మహిళా రైతు
యూరియా సరఫరాలో కాంగ్రెస్ సర్కారు నిర్వాకం పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నది. అన్నదమ్ముల్లా ఉన్న రైతుల నడుమ అగ్గిరాజేస్తున్నది. శనివారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి సహకార సంఘం వద్ద రెండు గ్రామాల రైతుల కొట్లాటలో గాయపడ్డ వెన్నంపల్లికి చెందిన రైతు గోపాల్‌రెడ్డి
ఎరువుల కోసం తిండీ తిప్పలు మాని వేకువజాము నుంచే క్యూలో నిలబడి పడిగాపులు కాయాల్సి వస్తుండటంతో రైతులు అస్వస్థతకు లోనవుతున్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పీఏసీఎస్ ఎదుట ఎరువుల కోసం శనివారం ఉదయం నుంచి లైనులో ఉండి సొమ్మసిల్లి పడిపోయిన కప్పలకుంట తండాకు చెందిన బానావత్ బుజ్జి
కరీంనగర్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/సైదాపూర్: పంట వేసిన రైతులు కంట నీరు పెడుతున్నరు. యూరియా సరఫరాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కంటి మీద కునుకు లేకుండా అవస్థలు పడుతున్నరు. కలసికట్టుగా యూరియా కోసం కొట్లాడుతున్న రైతుల మధ్య కూడా ప్రభుత్వ ప్రణాళిక లోపం చిచ్చు పెడుతున్నది. యూరియా కోసం వివిధ గ్రామాల రైతులు ఘర్షణకు దిగాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నది. శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో యూరియా కోసం రైతులు నెత్తురోడాల్సి వచ్చింది. యూరియా కోసం రెండు గ్రామాల రైతుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
వెన్నంపల్లి సింగిల్ విండో పరిధిలోని వెన్నంపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు అధికారులు టోకెన్లు ఇచ్చారు. ఉదయం నుంచి వందలాది రైతులు బారులు తీరగా మధ్యాహ్నం 3 గంటలకు 330 యూరియా బస్తాలతో లారీ వచ్చింది. ఎక్కువ మంది రైతులు ఉండటంతో ముందుగా తమకే ఇవ్వాలంటూ రెండు గ్రామాల రైతులు వాగ్వాదం చేసుకున్నారు. ఒకరినొకరు నెట్టుకున్నారు. పరిస్థితి తీవ్రంగా మారి, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది.
ఈ గొడవలో వెన్నంపల్లికి చెందిన కంది గోపాల్‌రెడ్డి అనే రైతు తలకు గాయమైంది. దీంతో రెండు గ్రామాల రైతులు ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి అందరినీ చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యూరియా ఎవరికీ పంపిణీ చేయలేదు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని ఇటీవల మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. శనివారం మంత్రి ఇలాకాలోనే రైతులు దాడులు చేసుకున్న నేపథ్యంలో ఆయన ఏం సమాధానం చెప్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ రైతు వేదిక వద్దకు తెళ్లవారుజామునే చేరుకుని, క్యూలో చెప్పులను, రాళ్లను వరుసలో పెట్టి, యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
మహబూబాబాద్‌లోని పీఏసీఎస్ సెంటర్ వద్ద ఎండలో నిలబడి సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు
మహబూబాబాద్‌లోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం ఎండలోనూ చెమటోడుస్తూ చంటి పిల్లాడిని ఎత్తుకొని లైన్లో నిలబడిన మహిళా రైతులు
కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం జరిగిన గొడవలో కొట్టుకుంటున్న వెన్నంపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల రైతులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలోని సొసైటీ వద్ద క్యూలో నిల్చున్నా యూరియా దొరకకపోవడంతో చెప్పులతో కొట్టుకుంటూ నిరసన తెలుపుతున్న రైతు
నిర్మల్ జిల్లా కడెంలో యూరియా కోసం ధర్నా చేస్తున్న వివిధ గ్రామాల రైతులు
మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండలో యూరియా కోసం రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులు, భారీగా నిలిచిపోయిన వాహనాలు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ రైతు వేదిక వద్ద యూరియా కోసం పెద్దసంఖ్యలో తరలివచ్చి క్యూలో నిల్చున్న వివిధ గ్రామాల రైతులు
మహబూబాబాద్ పీఏసీఎస్ వద్ద యూరియా బస్తాలు పంపిణీ చేసేందుకు హమాలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులకు గన్మ్యాన్లతో బస్తాలను ఇప్పిస్తున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ పీఏసీఎస్ సెంటర్‌కు యూరియా లారీ వచ్చినా తమకు పంపిణీ చేయకపోవడంతో షటర్‌పై కుర్చీతో దాడి చేస్తున్న మహిళా రైతు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులోని రైతువేదిక వద్ద తోపులాటలో గాయపడిన రైతు బానోత్ రమేశ్
మహబూబాబాద్‌లో రైతులు యూరియా లారీపై రైతులు రాళ్ల దాడి చేశారు. లైన్లో నిలబడి ఓపిక నశించి, వ్యవసాయశాఖ అధికారులు పెడుతున్న ముప్పుతిప్పలతో విసిగివేసారిన అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కంకర బోర్డు కాలనీలోని పీఏసీఎస్ వద్ద రైతులు ఉదయం 8 గంటల నుంచి క్యూలో నిలబడ్డారు. పోయిన శనివారం కూపన్లు ఇచ్చిన వారికి యూరియా పంపిణీ చేస్తారని సమాచారం తెలుసుకున్న రైతులు ఈ శనివారం క్యూ కట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు అధికారులు వచ్చి.. సోమవారం పంపిణీ చేస్తామని చెప్పారు. దీంతో రైతులు ఒకసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఏసీఎస్ షెటర్లపైకి కుర్చీలు విసిరేశారు.
యూరియా అన్లోడ్ చేస్తున్న లారీపైకి కొంతమంది రైతులు ఎక్కి యూరియా సంచులు తీసుకెళ్లారు. ఒక దశలో రైతులు లారీ పైకి రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించిన పోలీసులు ఎస్పీ రాంనాథ్ కేకన్‌కు సమాచారం అందించారు. యూరియా పంపిణీ కేంద్రం వద్దకు చేరుకున్న ఎస్పీ.. రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతకుముందు జరిగిన తొపులాటలో ఓ మహిళా స్పృహ తప్పి పడిపోయింది.