Rythu Bharosa | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వానకాలంలో సాగు చేసిన ప్రతి ఎకరా భూమినీ యాసంగిలోనూ సాగు చేయడం సాధ్యమేనా? యాసంగిలో పంటలు సాగు చేయనంత మాత్రాన ఆ భూమి పనికిరాని భూమి అవుతుందా? కాంగ్రెస్ సర్కార్ మాత్రం.. వానకాలంలో పంటలు సాగై.. నీళ్ల కొరతతో యాసంగిలో సాగు చేయని భూములను పనికిరాని భూముల కింద జమ కడుతున్నది. ఈ భూములను రాళ్లు, రప్పలు, కొండల కింద చూపుతూ రైతు భరోసాకు ఎగనామం పెట్టేందుకు సిద్ధమవుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల శాసనసభకు అందించిన వివరాల్లో యాసంగిలో పంటలు వేయని భూములను సాగులో లేని భూముల కింద చూపించడమే ఇందుకు నిదర్శనం.
ఈ భూములకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు వృథా అని, ఆయా భూములకు రైతుబంధు ఇచ్చి రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్ గుండెలు బాదుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చి రూ. 21 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందంటూ ముఖ్యమంత్రి, మంత్రులు బీఆర్ఎస్పై ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేశారు. ఎన్నికల ముందు ఇదే రకమైన ప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని మరింత ఎక్కువ చేసింది. అయితే, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా తాము చేసింది తప్పుడు ప్రచారమేనని ప్రభుత్వమే అంగీకరించింది.
ఇన్నాళ్లు రాళ్లు, రప్పలు, కొండలకు రైతుబంధు ఇచ్చారంటూ ఆరోపించిన కాంగ్రెస్.. అసెంబ్లీలో మాత్రం సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ యాసంగిలో పంటలు సాగు చేయని భూములకు ఇచ్చినట్టుగా పేర్కొన్నది. తద్వారా రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు అంటూ తాము చేసిందంతా తప్పుడు ప్రచారమేనని అంగీకరించినట్టయ్యింది. నిజానికి, వానకాలంలో సాగు నీళ్ల వసతి ఎక్కువగా ఉండటంతో పంటల సాగు విస్తీర్ణం కూడా ఎక్కువగానే ఉంటుంది. యాసంగిలో నీళ్ల వసతి తక్కువగా ఉండటంతో తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన బీఆర్ఎస్ సర్కార్.. సీజన్‌తో సంబంధం లేకుండా పంటల సాగుకు అనుకూలమైన భూములన్నింటికీ రైతుబంధు అందించి రైతులకు అండగా నిలిచింది. ఈ వాస్తవాన్ని విస్మరించి కాంగ్రెస్ విష ప్రచారం చేసింది.
యాసంగిలో భారీ మొత్తంలో భూములకు రైతుభరోసా ఎగనామం పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. శాసనసభలో మంత్రి తుమ్మల చెప్పిన లెక్క ప్రకారం.. 2022-23లో బీఆర్ఎస్ ప్రభుత్వం 294.88 లక్షల ఎకరాలకు రూ.14,743 కోట్ల రైతుబంధు పంపిణీ చేసింది. అయితే, ఆ ఏడాది 206.76 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయని, 88.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాకపోయినా రూ.4,406 కోట్లు రైతులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ఏడాది వానకాలంలో 135 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, యాసంగిలో 72 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. వానకాలం, యాసంగి సాగు విస్తీర్ణం కలిపితే 207 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ లెక్కన వానకాలంతో పోల్చితే యాసంగిలో తగ్గిన 63 లక్షల ఎకరాలతోపాటు అదనంగా 15 లక్షల ఎకరాల్లో సాగైన ఉద్యాన పంటలను జాబితా నుంచి తొలగించి మొత్తం 88 లక్షల ఎకరాలు సాగులో లేనట్టుగా కాంగ్రెస్ సర్కార్ పేర్కొనడం గమనార్హం.
అసెంబ్లీలో మంత్రి ఇచ్చిన నివేదిక ప్రకారం.. యాసంగిలో పంటలు వేయని భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సాగు జాబితా నుంచి తొలగించింది. ఈ విధంగా ఏటా సుమారు కోటి ఎకరాల వరకు కోతపెట్టింది. వాస్తవానికి వానకాలం సీజన్లో పత్తి సుమారు 50 లక్షల ఎకరాల్లో, కంది, మొక్కజొన్న, సోయాబీన్ 5 లక్షల ఎకరాల చొప్పున సాగవుతాయి. పెసర, జొన్న, మిల్లెట్స్ పంటలు కూడా భారీగానే సాగవుతాయి. ఈ పంటలను తిరిగి యాసంగిలో సాగు చేయరు. వరి సాగు కూడా 10-15 లక్షల ఎకరాలు తగ్గుతుంది. దీంతో వానకాలంతో పోల్చితే యాసంగిలో సుమారు 75-80 లక్షలకుపైగా ఎకరాల్లో పంటల సాగు తగ్గుతుంది.
ఈ విధంగా తగ్గిన పంటల సాగు విస్తీర్ణాన్ని సాగు భూమి జాబితా నుంచి ప్రభుత్వం తొలగిస్తున్నది. ఈ నేపథ్యంలో పత్తి, కంది, మొక్కజొన్న, సోయాబీన్‌తోపాటు నీళ్ల కొరత కారణంగా వరి సాగు చేయలేని రైతులకు యాసంగిలో రైతుభరోసా రాదనే ప్రచారం జరుగుతున్నది. ఇదే నిజమైతే, ఆయా రైతులంతా తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23లో 88.12 లక్షల ఎకరాలకు, 2023-24లో 97.51 లక్షల ఎకరాలకు సాగులో లేకపోయినప్పటికీ రైతుబంధు ఇచ్చినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా వానకాలంలో పంటలు సాగై.. యాసంగిలో నీళ్ల వసతి లేకపోవడంతో సాగు చేయలేకపోయిన భూములే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా అమలులో భాగంగా యాసంగిలో ఏకంగా కోటి ఎకరాలకు కోత పెట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు సీజన్లకు బీఆర్ఎస్ ఇచ్చిన రైతుబంధు, రెండు సీజన్లలో సాగైన భూమి, యాసంగిలో సాగుకాని భూమి లెక్కలు… (లక్షల ఎకరాల్లో)