మిర్యాలగూడ, నవంబర్ 10 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని పలు మిల్లుల వద్ద ఆదివారం రైతులు ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మద్దతు ధర చెల్లించడం లేదని ధర్నాలు, రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మిర్యాలగూడ, వేములపల్లి పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం సుమారు 3 వేల ధాన్యం ట్రాక్టర్లు వచ్చాయి. దాంతో రోడ్ల వెంట ట్రాక్టర్లు బారులుదీరగా.. మిల్లుల్లో కొనుగోళ్లు మందగించాయి. ఇదే అదునుగా మిల్లర్లు మద్దతు ధర ఇవ్వకుండా ధాన్యం తేమగా ఉన్నదని, రంగు మారిందని, పచ్చ గింజ ఉన్నదని పలు కారణాలతో తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రోడ్డుపైనే ట్రాక్టర్లను నిలిపి రాస్తారోకో చేశారు. మహీంద్ర, చింట్లు రకాలైన ఎర్ర రకం ధాన్యానికి రూ.2150 నుంచి రూ.2250 వరకు ధర వేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
సమీక్ష చేసినా దక్కని మద్దతు ధర
రైతుల ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివారం మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో మిర్యాలగూడ రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్ 3 గంటలపాటు సమీక్ష నిర్వహించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,320 నుంచి రూ.2,400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ మేరకు రైస్ మిల్లర్లు అంగీకరించారు. కానీ ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులు తీరడంతో పలు రకాల సాకులతో రూ.2,150 నుంచి రూ.2,350 వరకు కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చెప్పినా రూ.2,300లోపు ధరకు చాలా ధాన్యం కొనుగోలు చేశారని, కష్టపడి పండించిన పంటను మిల్లర్లు గంటల వ్యవధిలోనే దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లను అధికారులు పరిశీలించడం లేదని రైతులు మండిపడుతున్నారు.