కోటగిరి, జూలై 15: పంట పెట్టుబడి కోసం రుణాలు ఇవ్వడం లేదంటూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఎదుట రైతులు మంగళవారం ధర్నాకు దిగారు. పంట రుణాలు అడుగుతుంటే ఎందుకు ఇవ్వట్లేదని లింగాపూర్ రైతులు సొసైటీ సీఈవోపై మండిపడ్డారు. 1800 ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్న తమ గ్రామంలో సహకార సంఘం తరఫున గోదాం నిర్మించాలని కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారంలో మక్కజొన్న పంటకు కావాల్సిన యూరియా కోసం రైతులు ఉదయం నుంచి క్యూలో ఉన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు ఆగ్రోస్ సెంటర్‌కు యూరియా వస్తుందనే సమాచారంతో ఉదయం ఏడు గంటల నుంచి రైతులు పడిగాపులు కాశారు. సాయంత్రం నాలుగు గంటలకు యూరియా లారీ 444 బస్తాల లోడ్‌తో ఆగ్రోస్ సెంటర్ రాగా, రైతులు క్యూలో ఉండి 3 బస్తాల చొప్పున తీసుకున్నారు. సకాలంలో యూరియా సరఫరా చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.