వైరా టౌన్, సెప్టెంబర్ 19: సాగునీరు విడుదల చేసి లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోకుండా కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడటంతో 18 రోజులుగా సాగునీరు తమ పంటల పొలాలకు రావడం లేదని పేర్కొన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో పాలేరు రిజర్వాయర్ పాత కాలువ కింది పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని కల్లూరు ఇరిగేషన్ కార్యాలయం వద్ద గురువారం ఆందోళన చేసేందుకు నిర్ణయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు.. అదే రోజు ఉదయం తెలంగాణ రైతు సంఘం నాయకులను ముందస్తు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో మరికొందరు రైతు సంఘం నాయకులు, రైతులు కలిసి వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ వద్ద నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద పంటలు ఎండిపోయి తీవ్రంగా రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, వెంటనే పాలేరు రిజర్వాయర్ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ గండికి సత్వరమే మరమ్మతులను చేయాలని డిమాండ్ చేశారు.