నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 4 : ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యంపై రైతులు కన్నెర్ర చేశారు. నెల రోజులైనా కాంటా పెడ్తలేరని, తూకం వేసినా మిల్లులకు పంపుతలేరని రైతులు మండిపడ్డారు. తాము చస్తే కానీ.. ధాన్యం కొనరా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గురువారం పలు జిల్లాల్లో రైతులు రోడ్లెక్కారు. వానకాలం సమీపిస్తున్నా తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించడం లేదని నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లి వద్ద గజ్వేల్-చేగుంట రహదారిపై రాయపోల్ మండలం వీరానగర్, అంకిరెడ్డిపల్లి గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులతో మాట్లాడి లారీల సమస్య పరిష్కరిస్తామని తొగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్సై మానస హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
తాము చస్తేనే ధాన్యం కొంటరా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తూ నవాబుపేట రైతులు సంగారెడ్డి జిల్లా హత్నూర తహసీల్ కార్యాలయం ఎదుట నర్సాపూర్-జోగిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రానికి లారీలు వచ్చే ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. జొన్నల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని సబ్ మారెట్లో రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ రైతులు తమ ట్రాక్టర్లలో ధాన్యం బస్తాలతో నేరుగా నంగునూరు తహసీల్ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. ఘనపూర్లో సుమారు 2,500 బస్తాల ధాన్యం తూకం వేసినా మిల్లులకు తరలించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.