Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు 21 జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. 29 జిల్లాల్లో ఒక్క వడ్ల గింజ కూడా కొనుగోలు చేయలేదు. 20 రోజుల క్రితమే కొనుగోళ్లు ప్రారంభించినట్టు ప్రకటించిన సివిల్‌సప్లయ్ సంస్థ.. ఇప్పటివరకు మూడంటే మూడు జిల్లాల్లోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసింది. ఈ నెల 7వ తేదీ వరకు 68 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి 60,982 టన్నులు, నల్లగొండ నుంచి 4,212 టన్నులు, కామారెడ్డి జిల్లా నుంచి 3 వేల టన్నులు కొనుగోలు చేసింది. మరో ఎనిమిది జిల్లాల్లో కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయా జిల్లాల్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ యాసంగిలో 8,200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్టు సివిల్‌సప్లయ్ సంస్థ గొప్పగా ప్రకటించింది. కానీ, ఈ నెల 7వ తేదీ వరకు 11 జిల్లాల్లో 1,272 కేంద్రాలు మాత్రమే ప్రారంభించింది. అంటే లక్ష్యంలో ఇవి 15 శాతమే. ఈ విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు పెద్దలు, సివిల్‌సప్లయ్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రూ.16 వేల కోట్లకుపైగా నిధులు అవసరం. దీంతోపాటు కనీసంగా 25 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేస్తే బోనస్ రూపంలో మరో రూ.1,200 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఇంత మొత్తం వెచ్చించడం ఇష్టంలేకనే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి, మార్చి రెండో వారం నుంచి వరి కోతలు మొదలవుతాయని అధికారులకు తెలుసు. దీంతో మార్చి 20 నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు సివిల్‌సప్లయ్ డైరెక్టర్ వీఎస్ఎన్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులిచ్చి 21 రోజులైనా, ఇంకా 21 జిల్లాల్లో అసలు కొనుగోలు కేంద్రాలే ప్రారంభించకపోవడం, 29 జిల్లాల్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 20న ఉత్తర్వులు జారీ చేసిన సివిల్ సైప్లె సంస్థ.. ఇన్ని రోజులు ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేదు? ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అడపా దడపా అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు రోజులపాటు వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట ఎక్కడ వానపాలై పోతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యాన్ని సర్కారు వెంటనే కొనుగోలు చేసి ఉంటే, రైతులకు ఈ టెన్షన్ ఉండేది కాదు. వర్షాలు పడితే, తడవకుండా ధాన్యాన్ని కాపాడుకొనేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. రైతులకు ప్రతి సంవత్సరం ఇచ్చే టార్పాలీన్లను సైతం ఈ సీజన్లో సరఫరా చేయలేదు. ఇప్పటివరకు వీటి కొనుగోలుకు టెండర్లే పిలవలేదు. రైతులకు ఉపయోపగడే పాడీ క్లీనర్లు, ఇతర పరికరాలను సైతం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేయలేదు.
కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ధాన్యం రైతులు గోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో రైతులంతా తమ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కానీ, సర్కారు మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. అక్కడక్కడ ప్రారంభించిన కేంద్రాల్లోనూ కొనుగోళ్లు మొదలు పెట్టలేదు. దీంతో రైతులు ఆయా కేంద్రాల వద్ద రోజుల తరబడి ధాన్యం బస్తాలతో పడిగాపులు కాస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రేయింబవళ్లు ధాన్యాన్ని కాపాడుకొనేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ, అధికారులు వచ్చి కాంటా పెట్టడం లేదు.
సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికే గోస పడుతున్న రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్ల తీరుతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం తూకంలో అడ్డగోలు కోతలు పెడుతున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తేమ, తాలు నెపంతో ఒక్కో బస్తాకు 2 నుంచి 3 కిలోలు కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి, ఒక బస్తాకు 40 కేజీలు మాత్రమే తూకం వేయాలి. కానీ, ఐకేపీ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ఒక్కో బస్తాకు 42-43 కిలోలు తూకం వేస్తూ, షీట్లో మాత్రం 40 కిలోలకే లెక్క చూపుతున్నారని రైతులు చెప్తున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లా కోటగిరి, గోన్గొప్ప గ్రామాల్లో తేమ పేరుతో తరుగు తీస్తున్నారని రైతులు ధర్నాకు దిగారు.
ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు నష్టం చేస్తున్నారు. ధాన్యం మద్దతు ధర రూ.2,320తోపాటు బోనస్ రూ.500 కలిపి రైతులకు రూ.2,820 దక్కాలి. కానీ, మొన్నటివరకు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.2,400 వరకు చెల్లించిన మిల్లర్లు ఇప్పుడు రూ.2,200 మాత్రమే చెల్లిస్తున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే.. ‘మా ధర ఇంతే.. ఇష్టముంటే అమ్ము.. లేకుంటే లేదు’ అని తెగేసి చెప్తున్నారు. పోనీ, వ్యాపారుల వద్దకు వెళ్లకుండా, సర్కారుకే అమ్ముకుందామంటే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవడం లేదు. ఒకవేళ తెరిసినా నానా రకాల కొర్రీలతో రోజుల తరబడి తిప్పుకొంటున్నారు. సర్కారు పెట్టే కొర్రీలు, ఇబ్బందులు భరించలేక రైతులు వ్యాపారులకే నష్టానికి అమ్ముకుంటున్నారు.