నమస్తే తెలంగాణ నెట్వర్క్ ; ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సుమారు నెల రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన రైతులు కాంటా కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కాంగ్రెస్ సర్కార్ పలుచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోగా, ప్రారంభించిన చోట ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతుండటంతో రైతులు దగా పడాల్సి వస్తున్నది. దీనికి తోడు వారం రోజులుగా అక్కడక్కడ కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు సర్కార్ నిర్లక్ష్యం, అటు ప్రకృతి ప్రకోపంతో ధాన్యం తడిసి ముద్దవుతున్నది. వెరసి అన్నదాతలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.
ధాన్యం కొంటలేరని పంచాయతీ ఆఫీస్ ముట్టడి

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లెడి గ్రామపంచాయతీని మంగళవారం ముట్టడించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, హమాలీల నుంచి వసూళ్ల కారణంగా కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని మండిపడ్డారు. 20 రోజులు దాటినా ఇప్పటివరకు 20 శాతం ధాన్యం కాంటా వేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. – ఆలూరు
ఎట్టకేలకు కొనుగోళ్లు ప్రారంభం

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంతోపాటు బొమ్మనపల్లి, సుందరగిరి గ్రామాల్లోని కేంద్రాల్లో ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కేంద్రాలను ప్రారంభించి పదిరోజులైనా కొనుగోళ్లు మొదలుకాకపోవడంపై ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంటా’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
కావడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు. – చిగురుమామిడి
ధాన్యంలో కోత పెడ్తే ఊరుకోం

మండలం పస్రా గ్రామంలో జాతీయ రహదారిపై రైతుల పక్షాన రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, సూడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతుల వద్ద క్వింటాల్‌కు 4కిలోల నుంచి 5కిలోల వరకు ధాన్యాన్ని కటింగ్ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. -గోవిందరావుపేట
ఆత్మకూర్‌లో బైఠాయించిన రైతులు

ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మంగళవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో రైతులు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నాలుగు గ్రామాల్లో గత వారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఎస్సై జయన్న, తహసీల్దార్ మోహన్‌కు అక్కడికి వచ్చి వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -అమరచింత
ధాన్యం కొనుగోలులో అలసత్వం వీడాలి ; మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టించి పంట పండించిన రైతులు, వాటిని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వెంటనే వరి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికీ పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయమని, దీంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను తూర్పారబట్టి రాశులుగా పోసుకుని కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని పువ్వాడ పేర్కొన్నారు.
జాడలేని వడ్ల కొనుగోళ్లు

హనుమకొండ, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; యాసంగి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నది. వరి కోతలు మొదలై 2 వారాలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటుచేసిన కేంద్రాలు ఉత్తుత్తిగానే దర్శనమిస్తున్నాయి.బస్తాలు లేక, వాహనాలు రాక కొనుగోళ్లు మొదలు కావడంలేదు. సర్కార్ తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాంటా ప్రారంభం కాకపోవడంతో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మార్కెట్ యార్డులో ఎండబోసిన వరి ధాన్యం.
ధాన్యం కొనాల్సిందే.. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 28 : రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి పక్షం రోజులైనా ప్రభుత్వం ఇప్పటివరకు గింజ కూడా కొనలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు పొలాల వద్దనే వడ్లను కొనుగోలు చేసేటోళ్లని గుర్తుచేశారు. ‘రెండేండ్లు ఆగండి.. మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది.. తర్వాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని శ్రీనివాస్‌గౌడ్ భరోసానిచ్చారు.
అధికారుల కొర్రీలను సహించం

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి వారం రోజులైనా కాంటా కాకపోవడంపై సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి, తడ్కపల్లి గ్రామాల రైతులు మంగళవారం ఎన్సాన్‌పల్లిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు కొర్రీలు పెడుతున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. – సిద్దిపేట అర్బన్