Farmers | ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి రోజులు గడుస్తున్నా తూకం చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డెక్కారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మార్డి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 15 రోజులుగా వరి కుప్పలు పోశామని రైతులు తెలిపారు. తీసుకువచ్చిన వడ్లను క్రమపద్ధతిలో తూకం చేయకుండా చిన్న రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఓ ఇద్దరు నాయకులు ఐకేపీ సీసీకి ఫోన్ చేసి ఫలానా పెద్ద రైతు అని చెప్పగానే వారివే తూకం వేస్తున్నారని మండిపడ్డారు. నాలుగైదు రోజులకు ఓ లారీ వస్తుందని, తొందరగా వడ్లు తరలించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్ధతి ప్రకారం కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. ధాన్యం కేంద్రంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
– కల్హేర్, మే 11
8 క్వింటాళ్ల జొన్నలే కొంటున్నరు
‘నేను యాసంగిలో నా రెండున్నర ఎకరాల పొలంలో జొన్న పంట సాగు చేసిన. కరెంటు కోతలు, సాగునీటి సమస్యలను తట్టుకుని పండించిన. 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాటిని అమ్ముదామంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు 8 క్వింటాళ్లు మాత్రమే కొంటామని అధికారులు చెప్తున్నారు. ఎకరాకు 8 క్వింటాళ్లు కొంటామనడం ఎక్కడి నిబంధన? ఇప్పటి వరకు 20 క్వింటాళ్లు అమ్మిన. మిగిలిన పంట ఇంటి దగ్గరే ఉంది.
ఇప్పుడు వాటిని నేను ఏం చేయాలి? బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి నిబంధనలు ఎన్నడూ చూడలేదు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొన్నారు’ అంటూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని కప్పర్లకు చెందిన రైతు గండ్రత్ భగవాండ్లు.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ఇంటికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.
అలాగే.. తలమడుగు మండలం లింగిలో మహిళా రైతు రాజ్యలక్ష్మి తమ జొన్న పంట అకాల వర్షానికి తడిసిపోయిందని, తడిసిన పంటను అధికారులు కొంటలేరని తెలిపింది. జొన్నల కొనుగోళ్ల సమస్యపై అధికారులతో చర్చిస్తామని, పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని ఎమ్మెల్యే అనిల్ రైతులకు హామీ ఇచ్చారు.