హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ పాలనలో రైతుల బతుకులు దిగజారాయని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు ఒక ప్రకటనలో విమర్శించారు పందేండ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీలో మళ్లీ నిరసనలు జరుగుతున్నాయని, దీనిని బట్టి చూస్తే రైతుల సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా దేశం ఎదిగినప్పటికీ.. రైతు బాగుకోసం ఒక్క సానుకూల నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొన్నారు. దేశంలో సమర్థులైన, అనుభవం ఉన్న బీజేపీ నేతలు చాలామంది ఉన్నారని, రాష్ట్ర రైతాంగం అభివృద్ధి కోసం బీజేపీ నేతలు జోక్యం చేసుకోవాలని హితవు పలికారు.