ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు మహబూబాబాద్‌లో గ్రోమోర్ దుకాణం పైకి రాళ్లు.. ఆగ్రహంతో షాపు ఎదుట నిప్పు తీలేరు, కొత్తగూడలో సొమ్మసిల్లిన రైతులు రైతుల చేతులపై పోలీసుల మార్కర్ గుర్తులు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ఆఫీస్ ముట్టడి గూడూరులో చీపుర్లతో మహిళల హెచ్చరిక గోదాము నుంచి బస్తాలను లాగేసిన రైతులు ఇల్లందు- మహబూబాబాద్ రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన పొగుళ్లపల్లిలో 94 బస్తాలు మాయం ఓవైపు యూరియా అందక పంటలు ఎర్రబారుతుండటంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.
కడుపుమండిన రైతులు రోజురోజుకూ కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నారు. తిండితిప్పలు మాని అర్ధరాత్రి నుంచే జాగారం చేస్తున్నా ఒక్క ఎరువుల బస్తా కూడా దొరక్కపోవడంతో ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఎరువుల కోసం ఇంత అరిగోస గత పదేండ్లుగా ఎన్నడూ పడలేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చి తమను రోడ్డున పడేసిందని మండిపడుతున్నారు. గురువారం సైతం రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు రాస్తారోకోలు, ధర్నాలు, ఆగ్రోస్ కేంద్రాల ముట్టడులతో అట్టుడికించారు.
‘యూరియా లేకుంటే పంటలు సాగు చేసేదెలా..? ఎన్ని రోజులు పడిగాపులు కాయాలి..? ఇక మాకు చావే దిక్కు’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్దఎత్తున బారులుతీరిన రైతులు… పంటలను కాపాడుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం ఆశగా ఎదురుచూశారు. లైన్లో నిలబడ్డ పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. భారీగా తరలివచ్చిన రైతుల మధ్య తోపులాట జరగడంతో పలువురు గాయపడ్డారు. ఒక్క బస్తా దొరికినా పంటను కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో రైతులంతా పీఏసీఎస్‌ల వద్దనే కనిపిస్తున్నారు.
యూరియా ఇవ్వకపోవడంతో సర్కారుపై కన్నెర్ర చేశారు. గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దక్కని రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు, యూరియా ఎప్పుడు ఇస్తారో కచ్చితంగా చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఇకనైనా యూరియా చల్లకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోయారు. కాంగ్రెస్ సర్కారు అలసత్వంతో యూరియా కొరత ఏర్పడిందని మండిపడుతున్నారు. అరకొరగా వచ్చిన యూరియాను కూడా కొందరు రాత్రికిరాత్రే బ్లాక్ మారెట్‌కు తరలిస్తున్నారని నిప్పులు చెరిగారు.
కామారెడ్డి జిల్లా జంగంపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసి రైతులు బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వరుసలో ఉన్నారు. గురువారం ఉదయం 4 గంటలకు రైతులు బారులు తీరగా పోలీసు పహారా మధ్య బస్తాలు పంపిణీ చేశారు. రామారెడ్డి సొసైటీ వద్ద బుధవారం రాత్రి నుంచే మహిళా రైతులు లైన్ కట్టారు. తోపులాట జరిగి మహిళలు కిందపడిపోయారు. తలమడ్ల సొసైటీ వద్ద యూరియా దొరకక రైతులు నిరాశగా వెనుదిగారు. బీబీపేట, మహమ్మద్‌నగర్‌లో రైతులు బారులు తీరారు.
మహబూబాబాద్‌లో ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణం ఎదుట రెండు రోజులుగా యూరియా కోసం వేచి ఉన్న రైతులు విసుగుచెంది ఆగ్రహంతో దుకాణంపైకి రాళ్లు విసిరారు. కొంతమంది రైతులు కట్టెలతో వచ్చి ఎరువుల దుకాణం ముందు మంట పెట్టారు. ఇల్లెందు బైపాస్ రోడ్డులోని యూరియా గోదాము లోపలకు దూసుకెళ్లారు. డీఎస్పీ తిరుపతి రైతులతో మాట్లాడి సర్దిచెప్పారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ కొంతమంది రైతులకు యూరియా బస్తాలు అందజేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని గురువారం రైతులు ముట్టడించారు. పోలీసులు అడ్డుకొని గేటు మూసివేయగా రోడ్డుపైనే బైఠాయించి మంత్రి పొన్నం, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా ఇచ్చే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పారు. ఆర్డీవో రామ్మూర్తి, సీఐ శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారులు.. యూరియా స్టాకు వస్తుందని, అప్పటివరకు టోకెన్లు తీసుకొని సిద్ధంగా ఉండాలని సూచించడంతో శాంతించిన రైతులు వ్యవసాయ
మార్కెట్ యార్డులో టోకెన్ల కోసం క్యూలో నిల్చున్నారు.
కామారెడ్డి జిల్లాలో రైతులను యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఎరువు కోసం రైతులు అరిగోస పడుతున్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసి, రైతులు కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి 12 గంటల నుంచి క్యూలో ఉన్నారు. ఒక్కో రైతుకు ఒకరికి ఒకే బస్తా ఇస్తామని అధికారులు చెప్పగా, వెయ్యి మందికి పైగా వచ్చిన రైతులు కనీసం రెండు అయినా ఇవ్వాలని వేడుకున్నారు. పెద్దఎత్తున క్యూలో నిలబడిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నాట్లు వేసి నెల గడిచిందని, ఎరువు వేయకపోతే పంట చేతికి అందకుండా పోతుందని వాపోయారు. అధికారులు కనిపించరించాలని వేడుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లి పీఏసీఎస్‌లో బుధవారం 94 యూరియా బస్తాలు మాయమయ్యాయి. గురువారం అధికారులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా హమాలీలు తీసుకెళ్లినట్టు గుర్తించారు. వారిని విచారించి, డబ్బులు రికవరీ చేసినట్టు తెలిపారు. గోదాము తాళాలు హమాలీల వద్దకు ఎలా వచ్చాయని, కొందరు అధికారులే యూరి యాను బ్లాక్ మార్కెట్‌కు తరలించారని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా దొరకపోవడంతో మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 12గంటలు లైన్లో నిలబడితే ఒక్క బస్తా కూడా దొరకలేదని మండిపడ్డారు. గూడూరులోని పీఏసీఎస్ వద్ద మహిళా రైతులు చీపురుకట్ట, కర్రలు చేతిలో పట్టుకొని, ‘యూరియా ఇవ్వకపోతే ఇంటికి వెళ్లేది లేదు.. ఖబడ్డార్’ అని హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా తీలేరు పీఏసీఎస్‌కు గురువారం యూరియా వచ్చిందని తెలిసి, వెయ్యి మంది రైతులు తరలివచ్చారు. యూరియా దొరకని రైతులు లాల్కోట చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. తెల్లవారుజామున 5 గంటలకు క్యూలో నిలబడిన రైతు మణెమ్మ 11 గంటల సమయంలో సొమ్మసిల్లి పడిపోయింది. తోటి రైతులు అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. అధికారులు రైతుల చేతివేలిపై గుర్తు పెట్టి టోకెన్లు పంపిణీ చేశారు.
రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు వ్యవసాయాధికారి కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఏవో కార్యాలయానికి వినతిపత్రం అతికించారు. పంటలకు ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని తెలిపారు.
యూరియా కోసం రోజుల తరబడి తిరిగినా దొరకకపోవడంతో మహబూబాబాద్‌లో రైతులు కన్నెర్ర చేశారు. ఇల్లెందు బైపాస్‌లోని గ్రోమోర్ గోదాం తాళంను పగలగొట్టారు. కొందరు రైతులు యూరియా బస్తాలను తీసుకెళ్లారు. పంట నాశనమైతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని, మరేం
నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో అలసత్వంతోనే రైతులకు యూరియా కొరత ఏర్పడిందని నిప్పులుచెరిగారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు పీఏసీఎస్ వద్దకు యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. వందలాది మంది బారులు తీరిన క్యూలైన్‌తో అక్కడి వాతావరణం జాతరను తలపించింది. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి లైన్లో నిల్చున్న కొందరు రైతులకు సాయంత్రం 4గంటల వరకు ఒక్కొక్క బస్తా చొప్పున లభించింది. మిగిలిన వారు ఆవేదనతో వెనుదిరిగారు. సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో పంటలు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.