Telangana | ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 14: కేసీఆర్ ప్రభుత్వంలో పండుగలా సాగు చేసుకున్న రైతు.. కాంగ్రెస్ ఏడాది పాలనలో అరిగోస పడుతున్నడు. ఇప్పటికే 60 శాతానికి పైగా రైతులు రుణమాఫీ కాక, రైతుబంధు రాక ఆగమవుతుండగా, సర్కారు మరో భారం మోపుతున్నది. సెస్ పరిధిలో ‘అడ్వాన్స్’ పేరిట ఒకేసారి రుసుము చెల్లించాలని హుకుం జారీచేసింది. మరోవైపు త్రీ హెచ్‌పీని ఫైవ్ హెచ్‌పీగా మార్చి రూ. 2,800 వరకు వసూలు చేస్తున్నది. ఇలా అయితే ఎవుసం ఎలా చేయాలని రైతులు నిలదీస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో మొత్తం 157 శాంక్షన్ అయిన మోటర్లు ఉన్నాయి. ఇవి సెస్ పరిధిలో ఉన్నాయి.
గతంలో ఆరు నెలలకు ఒక్కో మోటర్‌కు రూ.185 చొప్పున బిల్లు చెల్లించేవారు. కానీ, ప్రస్తుతం అధికారులు ‘అడ్వాన్స్’ పేరిట రైతులపై భారం మోపుతున్నారు. 2024 మే నుంచి 2025 మే వరకు 12 నెలలతోపాటు గతంలో వసూలు చేయని నాలుగు నెలలు కలిపి మొత్తం రూ.480 చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. అవసరైతే మొదటి వాయిదా కింద రూ.300, రెండో వాయిదా రూ. 180 చెల్లించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే వసూలు కూడా ప్రారంభించారు. మరోవైపు త్రీ హెచ్‌పీ కనెక్షన్లను ఫైవ్ హెచ్‌పీగా అప్‌గ్రేడ్ చేస్తూ ఒక్కో మోటర్‌కు రూ. 2,800 వరకు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే అందులో కొన్ని మోటర్లు త్రీ హెచ్‌పీగా ఉన్నా ఫైవ్ హెచ్‌పీగా మార్చి బిల్లు వసూలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
నాకు ఓ దగ్గర ఎకరంన్నర భూమి ఉంటే ఆడ బోర్ మోటర్ పెట్టిన. పదిహేనేండ్ల సంది అక్కడ పంటనే ఏత్తలేను. అయినా ఆరునెల్లకోసారి రూ.185 కడుతున్న. ఇప్పుడు దానిని ఫైవ్ హెచ్‌పీ కనెక్షన్ కింద మార్చి రూ.2,720 వసూలు చేసిన్రు. బాయిలకాడ మోటర్లకు వేలకువేలు వసూలు సేత్తున్నరు.
-లాల లింగయ్య, రైతు (పోతిరెడ్డిపల్లి)
నాకున్న ఎకురంన్నర భూమిని ఎన్నో ఏండ్ల సంది బీడువెట్టిన. అయినా అక్కడున్న త్రీ హెచ్‌పీ మోటర్‌కు 6నెలలకు ఓసారి రూ.185 కట్టెటోన్ని. ఇప్పుడు పంటలు ఏస్తున్న. అదే త్రీ హెచ్‌పీ మోటర్ వాడుతున్న. కానీ, ఇప్పుడు అడ్వాన్సుగా రూ.480 కట్టమంటుర్రు. నేను త్రీ హెచ్‌పీ మోటర్ మార్చకున్నా ఫైవ్ హెచ్‌పీ కింద మార్చిన్రు. ఇంకో రూ.2700 కట్టాలని సెస్ ఆఫీసోళ్లు అంటున్నరు. ఇప్పటికే రైతుబంధురాక పెట్టిబడికి పైసల్లేక ఇబ్బంది పడుతున్నం. కరెంటు బిల్లులు ఇష్టమొచ్చినట్టు వసూలు చేస్తే వ్యవసాయం ఎట్ల జేస్తం?
-గన్నమనేని లక్ష్మణ్‌రావు, రైతు (పోతిరెడ్డిపల్లి)