Telangana | డోర్నకల్, ఏప్రిల్ 14 : యాసంగి వరి పంట సాగు నీళ్ల కోసం రైతులు అరిగోసపడ్డారు. బావుల్లో పూడిక తీసి, బోరు బావులు వేయించారు. కొందరు మున్నేరు, ఆకేరు వాగుల్లో పొక్లెయిన్లతో బావులు తవ్వించారు. సాగు నీరు లేక పంట పొలాలను పశువుల మేతకు వదిలేసినా ప్రభుత్వం కనికరించలేదు.
వరి సాగు పూర్తయి కోతలు కోస్తున్న సమయంలో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్నేరు వాగులోకి శ్రీరాంసాగర్ జలాలు విడుదల చేశారు. అధికారుల తీరుపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతులకు సాగు నీరు తెచ్చి ఇచ్చినట్టుగా సంబురాలు చేసుకోవడం గమనార్హం.
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భూసార పరీక్షలకు ఏప్రిల్, మే నెలలు అనువైనవని, ప్రస్తుతం ప్రతి రైతు తప్పనిసరి భూసార పరీక్షలు చేయించాలని భూసార ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పవన్ చంద్రారెడ్డి సూచించారు. భూసార పరీక్షల వల్ల పొలాల్లో లోపించిన పోషకాలను తెలుసుకుని.. తగిన మోతాదుల్లోనే ఎరువులను వాడవచ్చునని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేలల్లో ఉన్న పోషక పదార్థాలతోపాటు సేంద్రియ, రసాయనిక ఎరువుల పోషకాలను మొక్కలకు అందజేసి అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. ఈ భూసార పరీక్షలతో భూసారాన్ని కాపాడుకోవడంతోపాటు, ఎరువుల వినియోగం తగ్గి.. ఖర్చులు తగ్గుతాయని వివరించారు.