భూగర్భ జలాలు అడుగంటి.. బోర్లు, బావులు వట్టిపోయి.. వాటి కింద వేసిన పంటలను కాపాడుకోలేక రైతులు అరిగోస పడుతున్నరు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ఇస్మాయిల్పల్లికి చెందిన రైతు మేడబోయిన పరశురాములు ఏడెకరాల్లో వరి పంట వేసిండు. 4 బోరు బావులున్నా చుక్కనీరు రాక పొట్టదశలో ఉన్న పంట కండ్లెదుటే ఎండుతుంటే కాపాడుకునేందుకు ఇలా ట్యాంకర్ ద్వారా తెచ్చి నీటి తడి అందిస్తున్నడు.
వరంగల్ నగరంలోని 3వ డివిజన్ కొత్తపేటలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో 5 రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయి పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆరెపల్లిలోని కొత్తపేట క్రాస్ వద్ద బుధవారం ధర్నా చేశారు. అన్నదాతల ఆగ్రహంతో దిగివచ్చిన అధికారులు సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించారు.
ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగు నీరు అందించకపోవడంతో సూర్యాపేట జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. నష్టపోయిన పంటకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా అందించడం లేదని మండిపడుతూ వాంకిడి మండలం ఎనోలి గ్రామస్తులు బుధవారం ఆందోళనబాట పట్టారు. దాదాపు 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్దకు ఖాళీ బిందెలతో వచ్చి ధర్నాకు దిగారు.
ఈ చిత్రం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తెట్టెకుంట తండాకు చెందినది. పంటను కాపాడుకోవడానికి పొలంలో నాలుగు బోర్లు వేసినా ఫలితం లేదని రైతు పద్మ చెప్పారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, సర్కార్ నీళ్లు లేవని, పంటని ఎలా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పంట మంచిగా ఎదుగుతున్న సమయంలోనే నీటి కొరత వేధిస్తుండటంతో కనీసం పెట్టుబడైనా వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
వేసవికి ముందే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటలకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందు తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకోర్పోల్ గ్రామంలోని
బావి కూడా అడుగంటింది.
ఈమె పేరు కలమ్మ.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గం తిప్పాయిగూడకు చెందిన ఈమె పొలాన్ని కౌలుకు తీసుకొని వరి సాగు చేసింది. అయితే నీళ్లు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పంటను సాగు చేసి నాలుగు రూపాయలు సంపాదించుకుందామన్న ఈమె ఆశలు ఆవిరయ్యాయి. చేసిన కష్టం పోతేపోనీగానీ అప్పు ఎలా తీర్చాలని కంటతడి పెట్టింది కలమ్మ.
ఈ చిత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తిప్పాయిగూడకు చెందినది. ఓ రైతు వరి సాగు చేయగా నీళ్లు లేకపోవడంతో ఎండిపోయింది. బోరు నుంచి కూడా చుక్కనీరు వస్తలేదు. దీంతో పొలాన్ని మేకలకు వదిలేశాడు రైతు. అయితే మేత మేసిన మేకలు దాహం తీర్చుకోవడానికి బోరు దగ్గరికి వచ్చి చాలా సేపు ప్రయత్నించాయి.
భూ తల్లినే నమ్ముకొని కోటి ఆశలతో అప్పులు చేసి సాగు చేస్తున్న పంటలు కళ్లముందే ఎండిపోతుంటే అన్నదాతల గుండెలు బరువెక్కుతున్నాయి. తమ కడుపు నింపుతుందని భావించి సాగు చేసిన పంటలను పశువులకు మేతగా మారడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో దశాబ్దం పాటు రెండు పంటలు సాగు చేసి రాజుగా వెలిగిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారి కరువు ఛాయలు అలముకుంటున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం తుంకినీపూర్ గ్రామంలో రైతు గడ్డమీది రాములు ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. పంటకు పెట్టుబడిలో 80 శాతం ఇప్పటికే ఖర్చు చేశారు. నీళ్లు లేక ఇప్పటికే సగానికి పైగా పంట ఎండిపోయింది. గత్యంతరం లేక పంటను పూర్తిగా పశువుల మేతకు వదిలేశాడు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్లకు చెందిన రైతు శార్థా మోహన్ తొమ్మిదెకరాల్లో జొన్న వేయగా ప్రస్తుతం కంకి దశకు చేరింది. పది రోజులుగా నీటి సమస్య కారణంగా పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. దీంతో పంటను కాపాడుకునేందుకు రూ.35 వేలు ఖర్చు చేసి రెండు రోజుల కిందట రెండు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదు. చేసేదేమీ లేక మూడు ఎకరాల జొన్న పంటలో పశువులను మేతకు వదిలేశాడు.