ఇల్లెందు రూరల్,/రుద్రంగి/ కోరుట్లరూరల్/ ఖానాపురం, ఆగస్ట్ 4 : ఓవైపు ఇప్పటికే ఆలస్యమైన వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు.. మరోవైపు యూరియా బస్తాలు సరిపడా అందక నానా తంటాలు పడుతున్నారు. సాగు పనులను వదులుకొని సొసైటీ గోదాంల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. పోలీసుల పహారా మధ్య పంపిణీ చేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలోని ఎన్హెచ్-365పై రైతులు రాస్తారోకో చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి సొసైటీ గోదాం ఎదుట రైతులు బారులు తీరారు. ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులుకాశారు. చాలా మంది యూరియా అందక వెనుదిరిగారు. ఫెర్టిలైజర్స్ షాపుల్లో ఒక్కొక్కరికి 3 నుంచి 4 బస్తాలు ఇచ్చారని, సహకార సంఘంలో మాత్రం ఒక్కరికి ఒకటే బస్తా ఇస్తున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసు పహారా మధ్య పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం సొసైటీ కార్యాలయం వద్దకు రైతులు తెల్లవారుజామునే చేరుకొని బారులుతీరారు.