వేములవాడ, ఆగస్టు 11 : రైతులకు కనీసం యూరియా కూడా అందించలేని దౌర్భా గ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెలకొన్న యూరియా సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిషరించడంతోపాటు రైతుల అవసరాలకు సరిపడా అందించాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రైతులకు యూరియా అందడం లేదని పేర్కొన్నారు.
యూరియా కోసం రైతులు అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన యంత్రాంగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగైదు రోజులుగా రైతులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కనీస పట్టింపులేదని విమర్శించారు. ఆయన సొంత గ్రామమైన రుద్రంగిలోనూ యూరియా కోసం రైతులు దాదాపు పది గంటలపాటు నిరీక్షించినా స్పందించక పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి రైతుపక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.