నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 19 : ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు సహనం కోల్పోతున్నారు. నెలా, నెలన్నర దాటినా కాంటా పెట్టకపోవడం, గన్నీ బస్తాలు ఇవ్వకపోవడం, లోడింగ్, అన్లోడింగ్ లేకపోవడంతో విసిగిపోయారు. మరోవైపు అక్కడక్కడా అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల్లో మార్పు రాకపోవడంతో పండించిన పంటకు నిప్పుపెడుతున్నారు. ధర్నాలు, రాస్తారోకో చేసినా స్పందించకపోవడంతో మంగళవారం వనపర్తి, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో పంటను దహనం చేసిన తీవ్ర నిరసన చేపట్టారు.

నెల రోజులు దాటినా కాంటా పెడ్తలేరని ఆగ్రహించిన రైతులు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రంతండాలో వడ్లకు నిప్పు పెట్టారు. రేపుమాపు అంటూ నిర్వాహకులు కాంటా పెట్టడటం లేదని మండిపడ్డారు. ఐదువేల గన్నీ సంచులు వస్తే ఒకరిద్దరికి ఇచ్చి మిగిలిన రైతులకు ఇవ్వకుండా మాయం చేశారని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. వడ్ల కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరానగర్‌కు చెందిన రైతులు గజ్వేల్-చేగుంట రహదారిపై బైఠాయించి ధాన్యం బస్తాకు నిప్పుపెట్టారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా రాలేదని మండిపడ్డారు. 45 రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ వనపర్తి జిల్లా రాజాపేటలో రైతులు రోడ్డెక్కారు.

ధాన్యం పోసి.. ఖాళీ బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తండాలో ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. పంట కోసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే హమాలీలు, లారీల కొరత పేరుతో కాంటాలు వేయడం లేదని మండిపడ్డారు. మరోవైపు, ఇసన్నపల్లిలోనూ అన్నదాతలు సోమవారం రాత్రి ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారంలో ధాన్యాన్ని దహనం చేసి నిరసన తెలిపారు. కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల గడుస్తున్నా లారీల కొరత కారణంగా సేకరించడం లేదని, తూకంలో క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తు ధాన్యానికి నిప్పుపెట్టారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలోని కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేపట్ట్టారు. సిద్దిపేటముస్తాబాద్ ప్రధాన రహదారిపై పుల్లూరు స్టేజీ వద్ద రైతులు రోడ్డుపై రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, లారీలు రాకపోవడం, అన్లోడింగ్ కాకపోవడంతో ఆగ్రహించిన రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించిన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని మన్నెవారి జలాల్పూర్ గ్రామ చౌరస్తా, వెల్దుర్తి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకున్నది.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ధాన్యం వద్ద కాపలా కాస్తున్నారు. జొన్నలు కొనుగోలు చేయాలని నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మార్కెట్ యార్డు వద్ద స్వర్ణ-నిర్మల్ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. జొన్నల కొనుగోలు పరిమితి ఎకరానికి 20 క్వింటాళ్లకు పెంచాలని కోరుతూ రైతులు ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో రాస్తారోకో చేపట్టారు. సుమారు 2 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. జన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దూర్‌కు చెందిన రాచర్ల రవి (49) వడదెబ్బతో మృతిచెందాడు. ధాన్యం విక్రయించేందుకు నిత్యం ఎండలో తిరుగుతూ వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.