– ఈ నెల 31న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సీపీఎం మహాధర్నా
– సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
భువనగిరి అర్బన్, ఆగస్టు 11 : జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కీలక ప్రాజెక్టులుగా ఉన్న బస్వాపురం, గంధమల్ల ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు, నవాబ్ పేట రిజర్వాయర్ ప్రాజెక్టు, చిన్న నీటి పారుదల కాలువలైన ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని, ఆసిఫ్ నగర్ కాలువ పునరుద్దరణ పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29, 30, 31 తేదీలలో సీపీఎం చలో హైదరాబాద్ పేరిట రైతులు, నిర్వాసితులు, ప్రజలతో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమై 31న హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ కు చేరుకుంటుందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే మహా ధర్నాలో రైతులు, వ్యవసాయ కార్మికులు, నిర్వాసితులు, వృత్తి దారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
90 శాతం పూర్తయిన బస్వాపురం ప్రాజెక్టుకు మిగతా నిధులు ఇవ్వడంలో జాప్యంపై వివరణ ఇవ్వాలన్నారు. సుమారు రూ.420 కోట్లకు పైచిలుకు డబ్బులు నిర్వాసితులకు చెల్లించవలసి ఉందన్నారు. రూ.80 కోట్లు మంజూరు చేసినట్లు చెబుతున్న ఫైనాన్స్ కమిటీ వద్ద సంవత్సరం నుండి నిధులు నిలిచిపోయని అన్నారు. భూ నిర్వాసితుల రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా రాచకొండ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి రిజర్వాయర్ ద్వారా నారాయణపూర్, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించాలని కోరారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నవాబుపేటకు నీళ్లు ఇస్తామని సుమారు 15 సంవత్సరాల కింద కాల్వలు తోవ్వారని కానీ అందులో నీళ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ వెడల్పు పనులు నిలిచిపోయాయన్నారు. పిలాయిపల్లి, బునాదిగాని కాలువల పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కాలువల కింద 30 కల్వర్టులు కట్టవలసి ఉందన్నారు.
జిల్లాలో మూసి ప్రక్షాళన, గోదావరి జలాలు అనుసంధానంకై ప్రభుత్వం దగ్గర డిపిఆర్ లేదని విమర్శించారు. బస్వాపురం ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపడానికి పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని, శామీర్పేట కాల్వ ద్వారా బొమ్మలరామారం, బీబీనగర్, భువనగిరి, పోచంపల్లి మండలాలకు సాగునీరు అందించాలన్నారు. ఈ నెల 16న సాగు తాగునీటి సమస్య పరిష్కారం కోసం వివిధ రాజకీయ పక్షాలతో, ప్రజాసంఘాలతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం భువనగిరిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 31న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహా ధర్నాకు పెద్ద ఎత్తున అన్ని వర్గాలు తరలిరావాలని యండి జహంగీర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు.