మహబూబ్‌నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్ : ఆ రైతు పేరు కుమ్మరి తిరుపతయ్య. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోయగా 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మరిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగోలులో జాప్యం ఆ రైతుకు శాపంగా మారింది. కోత కోసిన తర్వాత మూడు రోజులు వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఇక కొనుగోలు కేంద్రానికి తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుందామనుకున్న ఆ రైతు ఆశలు అడియాశలయ్యాయి. ధాన్యాన్ని తీసుకువెళ్తే మాయిశ్చర్ వచ్చిందంటూ ఆలస్యం చేశారు. మాయిశ్చర్ చూసిన తర్వాత నింపడానికి సంచుల్లేవంటూ మరో మూడ్రోజులు ఆలస్యం చేశారు.
సంచులు వచ్చే సరికి వర్షం పడి వడ్లు తడిసిపోయాయి. నానిన వడ్లను మళ్లీ ఆరబెట్టి మాయిశ్చర్ చూడమంటే మరో రెండ్రోజులు చేశారు. మరో మూడ్రోజులు లారీలు లేవని ఆపారు. మళ్లీ వర్షం వచ్చి వడ్లు తడిసిపోయాయి. వాటిని మళ్లీ ఆరబోసి మాయిశ్చర్ చూపించిన తర్వాత సంచుల్లోకి నింపారు.. చివరకు లారీలు లేవని మళ్లీ ఆపడంతో సొంతంగా ట్రాక్టర్ రోజుకు రూ.3 వేలు కిరాయికి మాట్లాడుకుని ట్రాక్టర్లో వేసుకొని రైస్‌మిల్లుకు తీసుకొచ్చారు.. అక్కడే ఆ రైతుకు అసలు కష్టం మొదలైంది. ఇంత దోపిడీ ఎప్పుడూ చూడలే అంటూ వాపోతున్నాడు.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు తిరుపతయ్య చివరకు రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీని వీడియో తీశారు. ఎంత బతిలాడుతున్నా.. తరుగు 19 కిలోలు తీస్తామని.. అవసరమైతే నీకోసం ఒక కేజీ తక్కువ తీస్తామని బెదిరింపులకు దిగారు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినప్పటికీ ధాన్యాన్ని దింపుకోకుండా రైస్ మిల్లర్ యజమాని రైతుకు బెదిరింపులకు దిగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. అయినా మొక్కవోని ధైర్యంతో రైతు రైస్ మిల్లర్ యజమానిని నిలదీస్తుండటం పలువురిని కదిలించింది.

ఐదు రోజులు గడిచింది.. సదరు రైతు పరిస్థితి చూసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చలించిపోయారు. వెంటనే ఈ దోపిడీపై మీడియాకు వివరించారు. పోతులమడుగు రైస్ మిల్లులో ఇది ఒక రైతు దీనగాధ. ఇలాంటి రైతులెందరో పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్నది. అయితే తరుగు, లంచం పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల మండిపడ్డారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు విషయంలో నిర్లక్ష్య వైఖరి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడమే కారణమని పేర్కొన్నారు.